Revanth Reddy | న్యూఢిల్లీ, మే 22: నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జిషీట్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరును కూడా చేర్చింది. వివాదాస్పద యంగ్ ఇండియన్ సంస్థకు సీఎం రేవంత్ రెడ్డి 2019-22 మధ్య విరాళాలు ఇప్పించారని పేర్కొన్నది. ఈ మేరకు ఏప్రిల్ 9వ తేదీన ఢిల్లీలోని స్థానిక కోర్టులో ఈడీ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ వివరాలు తాజాగా బయటికి రాగా జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. డెక్కన్ హెరాల్డ్, ఎకనమిక్ టైమ్స్ కథనాల ప్రకారం.. యంగ్ ఇండియన్ , అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు వచ్చిన విరాళాల్లో అవకతవకలు జరిగినట్టు ఈడీ పేర్కొన్నది. కొందరికి పదవులు, టికెట్లు ఆశ చూపి విరాళాలు సేకరించారని, మరికొందరికి రాజకీయ భవిష్యత్తు, వ్యాపారాలు దెబ్బతింటాయని భయపెట్టి విరాళాలు అందేలా చేశారని చార్జిషీట్లో ఈడీ పేర్కొన్నది.
అయితే ఈ చార్జిషీట్‌ను కోర్టు ఇంకా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నది. పీఎంఎల్ఏ కింద ఈడీ నమోదు చేసిన ఈ కేసులో మొదటి ముద్దాయిగా(ఏ-1) కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ పేరును, రెండో ముద్దాయిగా(ఏ-2) రాహు ల్ గాంధీ పేరును ఈడీ పేర్కొన్నది. వీరితోపాటు మరో ఐదుగురి పేర్లను నిందితులుగా ఈడీ చేర్చింది. నేషనల్ హెరాల్డ్ నుంచి రూ.2,000 కోట్ల ఆస్తులను చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకునేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి మెజారిటీ షేర్లు ఉన్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కుట్ర పన్నినట్టు ఈడీ ఆరోపించింది.
ఇందుకోసం పలువురు కాంగ్రెస్ నేతలు విరాళాలు సేకరించినట్టు తెలిపింది. యంగ్ ఇండియన్ కోసం విరాళాలు ఇవ్వాలని కోరిన వారిలో సీఎం, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఏ రేవంత్ రెడ్డి, దివంగత నేత అహ్మద్ పటేల్, పవన్ బన్సల్ పేర్లు ఉన్నాయి. 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాల్లో యంగ్ ఇండియన్ సంస్థకు వరుసగా రూ.6.90 కోట్లు, రూ.5.05 కోట్ల మేర విరాళాలు వచ్చినట్టు ఈడీ గుర్తించింది. ఈ డబ్బును ఆ సంస్థ 2011-12 ఆర్థిక సంవత్సరానికి చెందిన ఆదాయ పన్ను పెండింగ్ బిల్లును చెల్లించేందుకు వినియోగించినట్టు ఈడీ పేర్కొన్నది. అయితే దర్యాప్తు సంస్థ.. చార్జిషీట్లో వీరెవరినీ నిందితులుగా పేర్కొనలేదు. మరోవైపు.. చార్జిషీటులో పేరు రావడంపై రేవంత్ రెడ్డి నుంచి కాని బన్సల్ నుంచి కాని ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాలేదని డెక్కన్ హెరాల్డ్ పేర్కొన్నది.
యంగ్ ఇండియన్ సంస్థకు విరాళాలు ఇచ్చేలా కాంగ్రెస్ నేతలపై సీనియర్లు ఒత్తిడి తెచ్చినట్టు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ పేర్కొన్నది. అహ్మద్ పటేల్ అభ్యర్థనను కాదనలేక యంగ్ ఇండియన్‌కి రూ.30 లక్షల విరాళాన్ని తన బ్యాంకు ఖాతా నుంచి ఇచ్చానని, మరో రూ. 20 లక్షలు నగదుగా ఇచ్చానని అరవింద్ విశ్వనాథ్ సింగ్ చౌహాన్ అనే కాంగ్రెస్ నాయకుడు చెప్పినట్టు తెలిపింది. అహ్మద్ పటేల్ తనకు ఏఐసీసీ కార్యాలయంలో పోస్టింగ్ ఇప్పిస్తానని, 2019 లోక్‌సభ ఎన్నికల్లో తన అల్లుడికి హిమాచల్ ప్రదేశ్‌లోని మండి టికెట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చి యంగ్ ఇండియన్‌కు విరాళాలు తీసుకున్నారని రాజీవ్ గంభీర్ అనే నాయకుడు వాంగ్మూలం ఇచ్చినట్టు ఈడీ తెలిపింది. అయితే తనకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో తన డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ గంభీర్ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి లేఖ రాసినట్టు ఈడీ వెల్లడించింది.
ఈ కేసులో భాగంగా 2023 నవంబర్‌లో ఢిల్లీ, ముంబై, లక్నోలోని ఏజేఎల్‌కు చెందిన రూ. 751.9 కోట్ల మేర విలువైన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకొంది. ఈ కేసులో ఇప్పటికే చార్జిషీట్‌ను దాఖలు చేసిన ఈడీ.. అందులో ఏ1గా సోనియాను, ఏ2గా రాహుల్‌ను పేర్కొన్నది. పీఎంఎల్ఏలోని సెక్షన్లు 3, 4, 44, 45 కింద నిందితులను శిక్షించాలని ఈడీ కోరుతున్నది. ఈ సెక్షన్ల కింద నేరం రుజువైతే పదేండ్ల వరకూ జైలు శిక్ష పడుతుందని న్యాయ నిపుణులు చెప్తున్నారు.
నేషనల్ హెరాల్డ్ పత్రికను 1938లో జవహర్లాల్ నెహ్రూ, పలువురు స్వాతంత్య్ర సమరయోధులు కలిసి ప్రారంభించారు. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) ప్రచురణ సంస్థ నేషనల్ హెరాల్డ్‌ను ప్రచురించేది. నేషనల్ హెరాల్డ్ సంస్థ బకాయిలు పేరుకుపోవడంతో 2008లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. కాగా, 2010లో కాంగ్రెస్ పార్టీ ఏజేఎల్ సంస్థకు రూ.90 కోట్ల మేర రుణాలు ఇచ్చింది. 2010 నవంబర్‌లో ఆ రుణాలను వసూలు చేసుకొనే హక్కును రూ. 50 లక్షలకే యంగ్ ఇండియనన్ అనే కంపెనీకి కట్టబెట్టింది. అలా ఏజేఎల్‌కు చెందిన 99 శాతం షేర్లు యంగ్ ఇండియాకు బదిలీ అయ్యాయి.
ఈ యంగ్ ఇండియన్ కంపెనీలో సోనియా, రాహుల్‌కు 76 శాతం షేర్లు ఉన్నాయి. కాగా, సోనియా, రాహుల్ ప్రధాన భాగస్వాములైన యంగ్ ఇండియన్ కంపెనీ కేవలం రూ. 50 లక్షలు చెల్లించి, రూ. 90.25 కోట్ల విలువైన ఏజేఎల్ సంస్థ ఆస్తులపై హక్కు సాధించిందని, ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ. 2,000 కోట్ల వరకు ఉంటుందని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి 2012లో కోర్టును ఆశ్రయించారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల కొనుగోలుకు కాంగ్రెస్ పార్టీ నిధులను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఈ కేసులో 2021లో ఈడీ దర్యాప్తు మొదలైంది. సీబీఐ విచారణ మొదలై.. మధ్యలోనే నిలిచినప్పటికీ, ఈడీ దర్యాప్తు కొనసాగుతున్నది.
యంగ్ ఇండియన్‌కు డొనేషన్ ఇవ్వాలని హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నేత రాజీవ్గంభీర్కు 2019లో ముఖ్యనేతలు ఒత్తిడి తెచ్చారు. ఏఐసీసీ కార్యవర్గంలో చోటు కల్పించడంతోపాటు మండి లోక్‌సభ స్థానం టికెట్ ఆయన అల్లుడికి ఇస్తామని కాంగ్రెస్ నాయకులు ఆశ చూపారు. దీంతో ఆయన లక్షల్లో సమర్పించుకున్నారు. అయితే తనకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో డబ్బులు వాపస్ ఇవ్వాలని ఆయన ఏకంగా సోనియాగాంధీకి లేఖ రాశారు. దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ఒత్తిడితో యంగ్ ఇండియన్‌కు రూ.50 లక్షలు ఇచ్చినట్టు గుజరాత్‌కు చెందిన అర్వింద్ విశ్వనాథ్‌సింగ్ చౌహాన్ ఆరోపించారు. తన బ్యాంకు ఖాతానుంచి రూ.30 లక్షలు బదిలీ చేయగా, మరో 20 లక్షలు నగదు రూపంలో ఏఐసీసీ కార్యాలయంలో అందజేశానని చౌహాన్ ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.