న్యూఢిల్లీ: బెట్టింగ్ యాప్ (1xbet)కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ పలువురు క్రికెటర్లు, సినీ నటులు, రాజకీయ నేతల ఆస్తుల్ని జప్తు చేసింది. మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్పతో పాటు, ప్రముఖ నటుడు సోనూసూద్, తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మిమి చక్రవర్తిల ఆస్తులను అటాచ్ చేసినట్టు ఈడీ అధికారులు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఈ జాబితాలో నటి నేహా శర్మ, మోడల్ ఊర్వశీ రౌటేలా తల్లి, బెంగాల్ నటుడు అంకుజ్ హజ్రాల ఆస్తులు కూడా ఉన్నాయి.
యువరాజ్ సింగ్‌కు చెందిన రూ.2.5కోట్లు, ఊతప్పకు చెందిన రూ.8.26 లక్షలు, సోనుసూద్‌కు చెందిన రూ.1 కోటి ఆస్తుల్ని జప్తు చేస్తున్నట్టు ఈడీ ఉత్తర్వులు పేర్కొన్నాయి. ‘1xbet’ అనే బెట్టింగ్ యాప్ ద్వారా రూ.1000 కోట్లకు పైగా మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ గుర్తించింది.
మనీ లాండరింగ్ కేసులో లూథియానాలోని పెరల్ ఆగ్రో కార్పొరేషన్ లిమిటెడ్ (పీఏసీఎల్), దాని ప్రమోటర్ నిర్మల్ సింగ్ భంగూలకు చెందిన రూ.3,400 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ శుక్రవారం అటాచ్ చేసింది. ఆస్ట్రేలియాలో కూడా ఈ సంస్థకు ఉన్న ఆస్తులను కూడా కలుపుకొంటే మొత్తం అటాచ్ చేసిన ఆస్తుల విలువ రూ.5,600 కోట్లకు చేరుకుంది.