Airports | న్యూఢిల్లీ: విమానాశ్రయాల్లో కడుపు నింపుకునేందుకో, దాహం తీర్చుకునేందుకో ప్రయత్నిస్తే జేబుకు చిల్లు పడుతుంది. బయట రూ.10కు దొరికే సమోసాకు విమానాశ్రయాల్లో దాదాపు రూ. 100 చెల్లించుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇకపై ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇష్టమైనవి ఇష్టంగా కొనుక్కొనే సౌలభ్యం రాబోతున్నది. దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో ‘ఎకానమీ జోన్స్’ ఏర్పాటు చేయాలని పౌరవిమానయానశాఖ యోచిస్తున్నది.
ఇలాంటివి ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నా ఇప్పుడు కార్యరూపం దాల్చబోతున్నది. ఈ జోన్స్‌లో టీ, స్నాక్స్, నీళ్లు, డ్రింక్స్ వంటివి చవకగా లభిస్తాయి. అయితే, ఇవి రెస్టారెంట్లలా ఉండవు. సాధారణంగా మాల్స్‌లో కనిపించే ఫుడ్కోర్టుల్లా ఉంటాయి. తొలుత వీటిని కొత్తగా అభివృద్ధి చేస్తున్న విమానాశ్రయాల్లో అందుబాటులోకి తీసుకొస్తారు. ఆ తర్వాత అన్ని ఎయిర్‌పోర్టులకు విస్తరిస్తారు.