న్యూఢిల్లీ, మే 10: లోక్సభ ఎన్నికల పోలింగ్ శాతాల ప్రకటనపై విపక్ష పార్టీలకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాసిన లేఖపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ఆరోపణలు నిరాధారమైనవని, అవాంఛనీయమైనవని శుక్రవారం పేర్కొన్నది. ఎన్నికల వేళ ఉద్దేశపూర్వకంగా ప్రజల్లో, పార్టీల్లో గందరగోళం వ్యాప్తి చేసే ప్రయత్నమని స్పష్టం చేసింది. మొదటి రెండు దశల పోలింగ్ శాతాల విడుదలలో ఎలాంటి లోపాలు, జాప్యం జరగలేదని పేర్కొంటూ ఈసీ ఐదు పేజీలతో స్పందనను విడుదల చేసింది.
ఖర్గే తన అభిప్రాయాలను స్వేచ్ఛగా పంచుకోవచ్చని, అయితే లేఖను బహిరంగపరచడం ఆయన ఉద్దేశంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని ఈసీ పేర్కొన్నది. ఇటువంటి చర్యలు ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఆటంకమని, ఎన్నికల ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అభిప్రాయపడింది. మరోవైపు పోలింగ్ శాతాల ప్రకటనలో జాప్యం, మోదీ, అమిత్షా సహా ఇతర బీజేపీ నేతల కోడ్ ఉల్లంఘనలపై ఇండియా కూటమి నేతలు ఈసీ అధికారులను కలిశారు.