Bihar polls : బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ (ECI) అక్కడి రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీచేసింది. ఎన్నికల ప్రచార ప్రకటనలకు పార్టీలు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు మంగళవారం అన్ని పార్టీలకు మార్గదర్శకాలు ఇచ్చింది.
అభ్యర్థులు సోషల్ మీడియాతో సహా ఎలక్ట్రానిక్ లేదా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఏదైనా రాజకీయ ప్రకటనలను ప్రచురించడానికి లేదా ప్రసారం చేయడానికి ముందు మీడియా సర్టిఫికేషన్ తీసుకోవడం, మానిటరింగ్ కమిటీ నుంచి ముందస్తు ధ్రువీకరణ పత్రం పొందడాన్ని ఈసీ తప్పనిసరి చేసింది. రాజకీయ ప్రచారాల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడం కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు ఈసీ అధికారులు పేర్కొన్నారు.
రాజకీయ ప్రకటనల కోసం ముందస్తు ధ్రువీకరణ ప్రక్రియను పర్యవేక్షించడానికి జిల్లా, రాష్ట్రస్థాయిలో పలు మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీలను ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన రాజకీయ పార్టీలపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 75 రోజులలోపు ప్రచార ఖర్చుల పూర్తి వివరాలను రాజకీయ పార్టీలు సమర్పించాలని ఈసీ సూచించింది.