Delhi | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: ఢిల్లీ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు నిర్వహించాలంటూ సీఎం కేజ్రీవాల్ చేసిన డిమాండ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం సుముఖంగా లేదని తెలిసింది. అధికార పార్టీ లేదా ఒక రాజకీయ పార్టీ ఆదేశాలతో ఎన్నికల షెడ్యూల్‌ను నిర్ణయించలేమని ఈసీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో ఆప్ సర్కార్‌కు కావాల్సినంత సంఖ్యా బలముందని, అలాంటప్పుడు ముందస్తు ఎన్నికలు జరపాల్సిన అవసరమేముందని ఈసీ భావిస్తున్నది. మహారాష్ట్ర, జార్ఖండ్లతో కలిపి ఢిల్లీ ఎన్నికలు నిర్వహించాలనుకుంటే, అందుకు బలమైన కారణం ఈసీ చూపాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెప్పారు.
అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. ఆయన లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా అపాయింట్మెంట్ను కోరగా మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు సమయం ఇచ్చారు. దీంతో కేజ్రీవాల్ ఎల్జీని కలిసి తన రాజీనామాను సమర్పించనున్నారు. ఆప్ ఎమ్మెల్యేలతో మంగళవారం సమావేశం కానున్నారు. ఈ సమావేశంలోనే కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే ఈ సమావేశంలో కాబోయే కొత్త ముఖ్యమంత్రి పేరుపై కూడా చర్చిస్తారు. కాగా, సోమవారం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్న కేజ్రీవాల్ కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి పేరుపై కొందరు నేతలతో ముఖాముఖీ సమావేశమయ్యారు.