న్యూఢిల్లీ : బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ (సర్) అంశం గురువారం పార్లమెంట్ సమావేశాల్ని కుదిపేసింది. బీహార్‌లో చేపడుతున్న ‘సర్’ను వెంటనే ఉపసంహరించుకోవాలని విపక్ష సభ్యులు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దీంతో పార్లమెంట్ ఇరు సభల్లోనూ తీవ్ర గందరగోళం ఏర్పడటంతో.. ఉభయసభలు మరుసటి రోజుకు వాయిదా పడ్డాయి. దీనికంటే ముందు లోక్‌సభలో బీహార్ ‘సర్’పై చర్చకు విపక్ష ఎంపీలు పట్టుబట్టారు.
కొంతమంది ఎంపీలు వెల్‌లోకి దూసుకుపోయి ‘సర్’కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘మీరు నినాదాలు చేయాలనుకుంటే వీధుల్లోకి పోవాలి’ అంటూ స్పీకర్ ఓం బిర్లా విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం సభ తిరిగి సమావేశమైన వెంటనే, అమెరికా సుంకాల విధింపుపై మాట్లాడేందుకు కేంద్ర మంత్రి గోయల్‌కు స్పీకర్ అనుమతించారు. ఆయన ప్రకటన ముగియగానే సభను స్పీకర్ మరుసటి రోజుకు వాయిదా వేశారు.