Ebola : ఆఫ్రికా దేశాల (African Countries) లో వేగంగా వ్యాపిస్తున్న ఎబోలా వైరస్ (Ebola Virus) పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengaluru) లో ఎబోలా కలకలం రేగింది. ఉగాండా (Uganda) కు చెందిన మహిళలో ఎబోలా వ్యాధి లక్షణాలు కనిపించాయి. దాంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 28 ఏళ్ల ఉగాండా మహిళ ఈ నెల 23న కెంపెగౌడ విమానాశ్రయంలో దిగారు.
అయితే ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు అధికారులు విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సదరు ఉగాండా మహిళకు కూడా స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. దాంతో ఆ మహిళలో ఎబోలా వ్యాధికి సంబంధించి తేలికపాటి లక్షణాలను గుర్తించారు. వెంటనే ముందుజాగ్రత్త చర్యగా ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు.
మరో రెండు రోజుల్లో ఆ శాంపిల్స్ ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కర్ణాటక ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి రిత్విక్ రంజన్పాండే దీనిపై మాట్లాడారు. ప్రస్తుతం ఆ మహిళ వైద్యాధికారుల పర్యవేక్షణలో ఉందన్నారు. ఆమెలో కన్పించిన లక్షణాలు ఎబోలాకు సంబంధించినవేనా.. కాదా..? అనే విషయంపై ముందుగానే స్పష్టత ఇవ్వలేమని చెప్పారు.