Diabetes | న్యూఢిల్లీ: రోజూ బాదం తింటే ఆసియా భారతీయుల వంటి నిర్దిష్ట జనాభాల్లో మధుమేహం అదుపులోకి వస్తుందని తాజా పరిశోధన వ్యాసం తెలిపింది. బాదం, గుండె ఆరోగ్యంపై గతంలో ప్రచురితమైన పరిశోధనలను విశ్లేషించిన అంతర్జాతీయ బృందం.. బాదం చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించగలదని, ప్రయోజనకరమైన గట్ బ్యాక్టీరియాను పెంచగలదని పేర్కొంది.
షార్ట్-చైన్ ఫ్యాటీ యాసిడ్ల ఉత్పత్తిని బాదం పెంచుతుందని చెప్పింది. ఈ తాజా వ్యాసం కరెంట్ డెవలప్మెంట్స్ ఇన్ న్యూట్రిషన్ జర్నల్‌లో ప్రచురితమైంది. రోజూ బాదం తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ 5 యూనిట్లు తగ్గినట్టు పరిశోధకులు గుర్తించారు. అలాగే డయాస్టోలిక్ రక్త పోటు స్వల్ప స్థాయిలోనైనా చెప్పుకోదగ్గ విధంగా 0.17-1.3 ఎంఎంహెచ్‌జీ మధ్య తగ్గినట్టు గుర్తించారు. అదనపు కొవ్వు తగ్గేందుకూ బాదం సాయపడుతుందని తెలిసింది.