భువనేశ్వర్ : ఒడిషాలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీకి స్ధానిక పోరులో భంగపాటు ఎదురైంది. ఒడిషా పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం ప్రారంభమైంది. పంచాయతీ పోరులో నవీన్ పట్నాయక్ సారధ్యంలోని పాలక బీజేడీ ఘనవిజయం దిశగా సాగుతోంది. ఫలితాల ట్రెండ్స్‌లో బీజేడీ క్లీన్‌స్విప్ చేస్తుండగా బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
315 జిల్లా పరిషత్ స్ధానాలకు ఓట్ల లెక్కింపు చేపట్టగా మధ్యాహ్నం వరకూ బీజేడీ 264 స్ధానాల్లో ఆధిక్యత కనబరుస్తుండగా బీజేపీ కేవలం 29 స్ధానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 16 స్ధానాల్లో ఇతరులు 6 స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఐదో దశలో భాగంగా 952 పంచాయతీల్లో 131 జడ్పీ సభ్యుల పదవులకు పోలింగ్ జరిగింది.
ఈసారి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు 13,514 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 36,523 మంది వార్డు సభ్యులు, 126 సర్పంచ్, 326 మంది పంచాయతీ సమితి సభ్యులు, ఒక జిల్లా పరిషత్ సభ్యుడు పోటీ లేకుండా గెలిచారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఐదు దశల స్ధానిక పోరులో లక్షకు పైగా ప్రభుత్వ సిబ్బంది పోలింగ్ విధుల్లో నిమగ్నమైందని, శాంతిభద్రతల పర్యవేక్షణకు 40,000 మంది పోలీసులను నియమించామని ఈసీ తెలిపింది.