Dushyant Chautala : హర్యానా (Haryana) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ప్రచారంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. జింద్ జిల్లా ఉచన కలాన్‌లో జననాయక్ జనతా పార్టీ (JJP) అధ్యక్షుడు, హర్యానా మాజీ ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతలా (Dushyant Chautala) కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు.
దుష్యంత్ చౌతలా బహిరంగ సభలో మాట్లాడుతుండగా.. కొందరు అగంతకులు గొడవ సృష్టించి కాన్వాయ్‌పై ఇటుకలు, రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో ఒక వాహనం అద్దాలు పగిలిపోయాయి. దాంతో పెద్ద సంఖ్యలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దుష్యంత్తోపాటు ఆజాద్ సమాజ్ పార్టీ నేత, ఎంపీ చంద్రశేఖర్ కూడా ఉచానాలో జరిగిన రోడ్‌షోలో పాల్గొన్నారు.
ఉచానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చౌతలా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. చౌతలా 2019లో కూడా ఇదే నియోజకవర్గం నుంచి గెలిచారు. 2014లో బీజేపీ అభ్యర్థి ప్రేమ్‌లత చేతిలో ఓడిపోయారు. ఈసారి చౌతలాపై బీజేపీ అభ్యర్థి చతర్భుజ్ అట్టారి (బీజేపీ), బ్రిజేంద్ర సింగ్ (కాంగ్రెస్) పోటీ చేస్తున్నారు. కాగా జింద్‌లో తన కాన్వాయ్‌పై దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేశానని, దర్యాప్తు జరుపుతున్నారని చెప్పారు.
దాడికి సంబంధించిన వీడియో ఫుటేజ్ అంతా తమ దగ్గర ఉందన్నారు. పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని చౌతలా కోరారు. ఎన్నికల కమిషన్‌కు తప్పనిసరిగా లేఖ రాస్తామని చెప్పారు. ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారని, గత రెండు ఎన్నికల్లోనూ తనపై దాడులు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరక్కుండా ప్రత్యేక నిఘా బృందాన్ని పంపాలని కోరారు.