రాయ్‌పూర్: మరో మహిళను పెళ్లాడుతున్న ప్రియుడిపై అతడి ప్రియురాలు యాసిడ్‌తో దాడి (Acid Attack) చేసింది. దీంతో వధువరులతోపాటు మరో పది మంది గాయపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 19న రాత్రి వేళ భన్పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛోటే అమాబల్ గ్రామంలో 25 ఏళ్ల దామ్రుధర్ బాఘేల్‌కు 19 ఏళ్ల యువతితో పెళ్లి జరుగుతున్నది. ఇంతలో పెళ్లి వేదిక ప్రాంతంలో కరెంట్ పోయింది. ఈ సందర్భంగా వరుడు దామ్రుధర్ బాఘేల్‌పై యాసిడ్ దాడి జరిగింది. దీంతో అతడితోపాటు వధువు, పెళ్లి మండపం వద్ద ఉన్న మరో పది మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. కరెంట్ లేకపోవడంతో యాసిడ్ పోసిన వ్యక్తి ఎవరన్నది అక్కడున్న వారు గుర్తించలేకపోయారు.
కాగా, వధువు దామ్రుధర్ బాఘేల్‌పై యాసిడ్ దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కరెంట్ లేకపోవడంతో యాసిడ్ దాడి చేసిన వ్యక్తిని ఎవరూ గుర్తించలేదన్న సంగతి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. వధువరులకు ఎవరితోనైనా ప్రేమ వ్యవహారం ఉన్నదా అన్న కోణంలో దర్యాప్తు చేశారు. దీంతో వరుడు దామ్రుధర్ బాఘేల్ ప్రియురాలి గురించి పోలీసులకు తెలిసింది. ఆమెను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు.
మరోవైపు వరుడు దామ్రుధర్పై తానే యాసిడ్‌తో దాడి చేసినట్లు అతడి ప్రియురాలు ఒప్పుకుంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన అతడు మోసగించడంతో ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులకు చెప్పింది. తాను పని చేసే పొలంలో డ్రిప్ ఇరిగేషన్‌ను క్లీన్ చేసేందుకు వినియోగించే యాసిడ్‌ను దొంగిలించినట్లు తెలిపింది. అలాగే తనను గుర్తించకుండా ఉండేందుకు మగవాడిగా డ్రెస్ ధరించి పెళ్లి వేదికపై ఉన్న వరుడు దామ్రుధర్పై యాసిడ్‌తో దాడి చేసినట్లు ఆమె వెల్లడించింది. దీంతో పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.