న్యూఢిల్లీ : గాలి నాణ్యత మరింత దిగజారుతుందనే హెచ్చరికల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలోకి టక్కుల ప్రవేశం, నిర్మాణరంగ కార్యకలాపాలపై తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు నిషేధం కొనసాగుతుందని పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌రాయ్ స్పష్టం చేశారు. బ్యాన్పై ఈ నెల 16న ప్రభుత్వం సమీక్ష నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఆయన ఆయాశాఖల అధికారులతో సోమవారం సమావేశం అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 6వ తరగతి, అంతకంటే ఎక్కువ తరగతుల విద్యార్థులకు పాఠశాలలు, కళాశాలతో పాటు కోచింగ్ సెంటర్లను వెంటనే తెరిపించాలంటూ విద్యాశాఖ.. పర్యావరణశాఖకు ప్రతిపాదనలు పంపిందని మంత్రి పేర్కొన్నారు. 5వ తరగతి కంటే తక్కువ చదివే పిల్లలకు ఈ నెల 20 నుంచి పాఠశాలలను పునః ప్రారంభించాలని విద్యాశాఖ సూచించినట్లు చెప్పారు.
పాఠశాలలు, కళాశాలల పునః ప్రారంభంపై సుప్రీం కోర్టు ఆదేశించిన ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ (CAQM)కు ప్రతిపాదన పంపనున్నట్లు పేర్కొన్నారు. నిర్మాణాలు, కూల్చివేత కార్యకలాపాలపై నిషేధం ఎత్తివేయాలని చాలా ఏజెన్సీల నుంచి అభ్యర్థనలు వచ్చాయన్నారు. వీటిపై ఈ నెల 16న సమీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ నెల 1 నుంచి 12వ తేదీ వరకు ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ 250 నుంచి 325 మధ్యనే ఉందన్న ఆయన.. రానున్న మూడు రోజుల్లో ఏక్యూఐ క్షీణించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారన్నారు. ధూళి కాలుష్యాన్ని నియంత్రించేందుకు నీటిని చల్లేలా అగ్నిమాపక శాఖ, పౌర సంస్థలు, ఇతర విభాగాలకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలకు, వాహనదారులకు జరిమానాలు విధించినట్లు వివరించారు.