Uttar Pradesh | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): మానవ రక్తం రుచి మరిగి ప్రాణాంతకంగా మారిన తోడేళ్ల బెడదతో యూపీలోని బహరాయిచ్ జిల్లా గడగడలాడుతున్నది. తోడేళ్ల భయంతో పిల్లలు స్కూల్స్, కాలేజీలకు వెళ్లడం మానేశారు. మార్కెట్లు, దుకాణాలు బంద్ అయ్యాయి. రైతులు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లడానికే భయపడే దుస్థితి దాపురించింది. మాహ్సీ సబ్ డివిజన్లోని పలు గ్రామాలు భయంతో నిర్మానుష్యంగా మారిపోయాయి.
50 రోజులుగా భయం భయం
గడిచిన 50 రోజులుగా జిల్లా వాసులు కంటిమీద కునుకులేకుండా బతుకుతున్నారు. నరమాంస భక్షక తోడేళ్ల దాడిలో 35 మంది ప్రజలు గాయపడ్డారు. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అటవీ, పోలీస్ శాఖ అధికారులు సంయుక్తంగా ‘ఆపరేషన్ భేడియా’ నిర్వహించి నాలుగు తోడేళ్లను పట్టుకున్నారు. ఇంకా మిగిలిన రెండు తోడేళ్ల కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగుతున్నది.
దాడులు అందుకే..
జనావాసాల్లోకి వచ్చి మరీ తోడేళ్లు దాడులు చేయడానికి గల కారణాలపై అటవీశాఖ నిపుణులు గతంలో తమ అనుభవాలను బట్టి పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు. తమ ఆవాసాలను, సంతానాన్ని కాపాడుకోవడానికే తోడేళ్లు ఈ రకమైన దాడులకు తెగబడొచ్చని దూద్వా నేషనల్ పార్క్ మాజీ డైరెక్టర్ సంజయ్ పాఠక్ అభిప్రాయపడ్డారు. సాధారణంగా తోడేళ్లు తమ పిల్లలకు ఎవరైనా హాని తలపెట్టినట్టు భావిస్తే ఈ తరహా దాడులు చేస్తాయన్నారు. బహరాయిచ్లో జరుగుతున్న దాడులకు ఇదే కారణం అయి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.