న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొత్త సంవత్సరం వేళ డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు గత ఏడాదితో పోలిస్తే 56 శాతం పెరిగినట్లు పోలీసులు వెల్లడించారు. న్యూ ఇయర్ వేళ 868 డ్రంకెన్ డ్రైవింగ్ చలాన్లు జారీ చేసినట్లు పోలీసులు చెప్పారు. గత ఏడాది ఇదే రోజు ఆ సంఖ్య 558గా ఉన్నట్లు పేర్కొన్నారు. పటిష్టమైన రీతిలో ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేయడం వల్ల కేసుల సంఖ్య పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. డ్రంకెన్ డ్రైవింగ్, స్పీడింగ్, మోటార్‌సైకిల్ స్టంట్స్, ప్రమాదకర ఉల్లంఘనలను అడ్డుకునేందకు ప్రత్యేక ట్రాఫిక్ బృందాలను మోహరించినట్లు అధికారులు చెప్పారు. మద్యం సేవించి వాహనం నడిపిన కేసులు పెరగడం ఆందోళనకరమే అని కొందరన్నారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రంతా అనేక ప్రదేశాల్లో బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించినట్లు పోలీసులు చెప్పారు.
చెకింగ్‌ను తప్పించుకునే బైకర్లను పట్టుకునేందుకు అనేక చోట్ల చెక్పాయింట్లను ఏర్పాటు చేశామన్నారు. సీసీటీవీ నిఘా ద్వారా సమర్థవంతంగా ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ కొనసాగించినట్లు చెప్పారు. న్యూ ఇయర్ సంబరాల నేపథ్యంలో ఢిల్లీ పోలీసు శాఖ అదనంగా సుమారు 20 వేల సిబ్బందిని శాంతి, భద్రతల కోసం మోహరించింది. జనం రద్దీగా ఉండే ప్రదేశాలైన కన్నాట్ ప్లేస్, హౌజ్ ఖాస్,ఏరోసిటీ వద్ద ప్రత్యేక నిఘా పెట్టారు. కేవలం జరిమానా విధించడం మాత్రమే కాదు అని, మద్యం తాగి వాహనం నడపరాదు అన్న బలమైన సందేశాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో పకడ్బందీగా ప్లాన్ అమలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.