మంగళూరు: కర్ణాటకలో రికార్డు స్థాయిలో మాదకద్రవ్యాలు దొరికాయి. మంగళూరు పోలీసులు 37 కేజీలకుపైగా ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.75 కోట్లు. ఈ కేసులో ఇద్దరు దక్షిణాఫ్రికా జాతీయులను బెంగళూరులో అరెస్టు చేశారు. మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ బెంగళూరులో నైజీరియా జాతీయుడిని గత సెప్టెంబరులో అరెస్ట్ చేశామన్నారు. అతని నుంచి రూ.6 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. లోతుగా దర్యాప్తు చేసినపుడు అంతర్జాతీయ నెట్వర్క్ గుట్టు తెలిసిందన్నారు. ఢిల్లీ-బెంగళూరు మధ్య విమానాల్లో ప్రయాణిస్తూ వీరు మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పారు.