ఈ నెలలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశరాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. అయితే ఈ వేడుకల్లో ప్రధాని మోదీపై ఉగ్రదాడులు జరగబోతున్నాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. అన్ని చర్యలూ తీసుకొని రిపబ్లిక్ డే వేడుకలకు పటిష్ట బందోబస్తు కల్పించే సన్నాహాలు ప్రారంభించారు.
దీనిలో భాగంగానే ఢిల్లీలో పారాగ్లైడింగ్, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ (డ్రోన్లు తదితరాలు), హాట్ ఎయిర్ బెలూన్స్ ఏవీ ఎగరేయడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. వచ్చే నెల అంటే ఫిబ్రవరి 15 వరకూ వీటన్నింటిపై నిషేధం విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.
ఈ నెల 20 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని తెలిపారు. భద్రతా కారణా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాళ్లు చెప్పారు. సమాజానికి హాని చేసే కొన్ని శక్తులు ప్రజల భద్రతకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.