Drishti IAS | దేశరాజధాని ఢిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్లో రావూస్ కోచింగ్ సెంటర్లో వరదల కారణంగా ముగ్గురు సివిల్ సర్వీస్ అభ్యర్థులు మరణించిన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దృష్టి ఐఏఎస్ కోచింగ్ సెంటర్ (Drishti IAS Coaching Center) వ్యవస్థాపకుడు వికాస్ దివ్యకీర్తి (Vikas Divyakirti) కీలక నిర్ణయం తీసుకున్నారు. మరణించిన విద్యార్థుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు ఒక్కో బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు (Drishti IAS announces Rs 10 lakh compensation).
పిల్లల్ని కోల్పోయిన బాధను ఎంత డబ్బుతో అయినా కొనలేమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అయితే, ఇలాంటి దుఃఖ సమయంలో వారి బాధను కొంతైనా తీర్చేందుకు ప్రయత్నంలో భాగంగా ఒక్కో బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు అందించినట్లు వెల్లడించారు. అదేవిధంగా రావూస్లోని ప్రస్తుత సెషన్ విద్యార్థులకు దృష్టి ఐఏఎస్ అకాడమీ ద్వారా ఉచితంగా క్లాస్‌లు చెప్పనున్నట్లు ప్రకటించారు.
ఢిల్లీ (Delhi)లోని ఓల్డ్ రాజేందర్ నగర్ (Old Rajinder Nagar)లో గల ఓ కోచింగ్ సెంటర్లోకి (Coaching Centres) వరద నీరు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో (Coaching Centre) శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. శనివారం రాత్రి 7 గంటల సమయంలో రావుస్ స్టడీ సర్కిల్ బేస్మెంట్లోకి ఒక్కసారిగా వరద నీరు చేరింది. ఈ సమయంలో బేస్మెంట్లో ఉన్న లైబ్రరీలో దాదాపు 18 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 15 మంది ఎలాగోలా బయటపడగా, ముగ్గురు మాత్రం నీటిలో మునిగిపోయారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఢిల్లీ అగ్నిమాపక శాఖ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చి వారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనలో తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన తాన్యా సోని(21), ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌కు చెందిన శ్రేయ యాదవ్(25), కేరళలోని ఎర్నాకుళంకు చెందిన నవీన్ దల్వైన్(29) వరదనీటిలో మునిగి మరణించారు. లైబ్రరీ డోర్‌కు బయోమెట్రిక్ వ్యవస్థ ఉందని, ఇది లాక్ అయిపోవడం వల్లే వీరు బయటకు రాలేకపోయారని పలువురు విద్యార్థులు చెప్తున్నారు.
Also Read..
Manu Bhaker | ఒలింపిక్స్‌లో సంచలనంతో పెరిగిన మను బాకర్ క్రేజ్.. 40 బ్రాండ్ల నుంచి ఆఫర్
Pune | ఇనుప గేటుపడి మూడేళ్ల చిన్నారి మృతి.. షాకింగ్ వీడియో