Coffee | న్యూఢిల్లీ : కాఫీని పరిమితంగా సేవించడం ఆరోగ్యానికి ప్రయోజనకరమేనని గతంలో చాలా అధ్యయనాల్లో తేలింది. కానీ, మరింత ఉత్తమ ఫలితాలను పొందాలంటే ఏ సమయంలో కాఫీని తాగాలో శాస్త్రవేత్తలు తేల్చారు. రోజంతా ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఒక్కసారి మాత్రమే కాఫీని సేవించాలని, అది కూడా ఉదయం వేళలో మితంగా సేవిస్తే ఆరోగ్యానికి మరింత ప్రయోజనం చేకూరడంతోపాటు మరణ ముప్పు తగ్గుతుందని వెల్లడించారు. అమెరికాలోని టులేన్ యూనివర్సిటీ నిపుణుల సారథ్యంలోని పరిశోధకుల బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. 40 వేల మందిని దాదాపు దశాబ్దం పాటు నిశితంగా పరిశీలించి అధ్యయన ఫలితాలను వెల్లడించారు. కాఫీ తాగే అలవాటే లేనివారితో పోలిస్తే ఉదయం వేళలో కాఫీ సేవించే వారికి మరణ ముప్పు 16% తక్కువగా ఉంటుందని, గుండె జబ్బులతో మరణించే అవకాశాలు 31% తక్కువగా ఉంటాయని సైంటిస్టులు ప్రకటించారు.