న్యూఢిల్లీ, ఆగస్టు 6: ప్లాస్టిక్ బాటిల్ నీళ్లను తాగితే రక్తపోటు వచ్చే ముప్పు పెరుగుతుందని ఆస్ట్రియాకు చెందిన ‘డాన్యూబ్ ప్రైవేట్ యూనివర్సిటీ’ పరిశోధకులు తేల్చారు. ప్లాస్టిక్ బాటిల్ నీళ్లు తాగటం ఆపేసి, రెండువారాల పాటు పంపు నీటిని తాగిన వారిలో రక్తపోటు తగ్గుదల కనిపించిందని పరిశోధకులు వివరించారు. ‘జర్నల్ మైక్రోప్లాస్టిక్స్’ వార్తా కథనం ప్రకారం, మనం తాగే నీళ్లలో, ఆహార పదార్థాల్లో మైక్రోపాస్టిక్ కణాలు ఉన్నట్టు సైంటిస్టులు గుర్తించారు.
దీనికి కారణం.. ప్లాస్టిక్ బాటిల్ నీళ్లు తాగటం, ప్లాస్టిక్ పాత్రల్లో నిల్వ చేసిన ఆహారాన్ని తినటం. అత్యంత సూక్ష్మమైన ప్లాస్టిక్ కణాలు (5 మిల్లీమీటర్ల పొడవు).. పేగులు, ఊపిరితిత్తులు, రక్తనాళల్లోకి చేరుతున్నాయని, దీంతో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అధ్యయనం తెలిపింది.