Coffee | న్యూఢిల్లీ: రోజుకు మూడు కప్పుల కాఫీ తాగిన వాళ్లలో జీవన శైలి సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటున్నదని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. డయాబెటిస్, గుండె సమస్యల బారిన పడే ముప్పు 40 నుంచి 50శాతం వరకు తగ్గుతుందని తెలిపింది. రోజూ కాఫీ, టీ తాగిన 1.88 లక్షల మంది డాటాను చైనాకు చెందిన సుజో మెడికల్ కాలేజీ సైంటిస్టులు విశ్లేషించారు. రోజుకు మూడు కప్పుల కాఫీ తీసుకున్న వాళ్లలో గుండెపోటు, హై బీపీ, మధుమేహం.. మొదలైన సమస్యల ముప్పు తగ్గినట్టు పరిశోధకులు గుర్తించారు.
మలప్పురంలో ఓ వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ
తిరువనంతపురం, సెప్టెంబర్ 18: కేరళలోని మలప్పురంలో ఓ వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ అయింది. తొలుత అనుమానిత కేసుగా గుర్తించిన వైద్య వర్గాలు, సదరు పేషెంట్ మంకీపాక్స్ బారిన పడ్డాడని తాజాగా నిర్ధారించారు. బుధవారం ఈ మేరకు కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ ‘ఫేస్బుక్’లో తెలిపారు. ఎంపాక్స్ సోకిన వ్యక్తి ఇటీవలే దుబాయ్ నుంచి కేరళకు వచ్చాడని మంత్రి చెప్పారు. ప్రస్తుతం అతడికి మలప్పురంలోని ప్రభుత్వ దవాఖానలో చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ఆఫ్రికా దేశాల్లో ఎంపాక్స్ కేసులు పెద్ద ఎత్తున నమోదుకావటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.