న్యూఢిల్లీ: హైపర్సానిక్ క్షిపణుల తయారీలో కీలక ముందడుగు పడింది. ఈ తర్వాతి తరం క్షిపణుల్లో వినియోగించే దీర్ఘకాలిక సూపర్సానిక్ కంబషన్ రాంజెట్(స్క్రాంజెట్) ఇంజిన్ గ్రౌండ్ టెస్ట్ విజయవంతంగా పూర్తి చేసినట్టు మంగళవారం రక్షణ శాఖ ప్రకటించింది. డీఆర్డీవో విభాగమైన హైదరాబాద్ కేంద్రంగా పని చేసే డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవెలప్మెంట్ ల్యాబొరేటరీ(డీఆర్డీఎల్) ఈ స్క్రాంజెట్ను తయారుచేసింది.
భారత్లో మొదటిసారి 120 సెకన్ల పాటు స్క్రాంజెట్ గ్రౌండ్ టెస్ట్ జరిపినట్టు రక్షణ శాఖ వెల్లడించింది. అన్ని ప్రమాణాల్లో ఈ ఇంజిన్ విజయవంతంగా పని చేసినట్టు తెలిపింది. కాగా, హైపర్సానిక్ క్షిపణులు అత్యాధునిక ఆయుధాలు. ఇవి మాక్ 5కి మించిన వేగంతో ప్రయాణించగలవు. అంటే, ధ్వని వేగానికి ఐదింతల వేగంతో దూసుకుపోతాయి.