న్యూఢిల్లీ: నౌకాదళ నౌకలను క్షిపణుల దాడులను నుంచి రక్షించేందుకు అవసరమైన అడ్వాన్స్డ్ చాఫ్ టెక్నాలజీని రక్షణ పరిశోధనా, అభివృద్ధి సంస్థ డెవలప్ చేసింది. డీఆర్డీవో ఈ విషయాన్ని ఇవాళ వెల్లడించింది. జోద్పూర్లో ఉన్న డిఫెన్స్ ల్యాబ్లో వీటిని డెవలప్ చేశారు. మూడు రకాల చాఫ్ టెక్నాలజీ వేరియంట్లను రిలీజ్ చేశారు. షార్ట్ రేంజ్ చాఫ్ రాకెట్(ఎస్ఆర్సీఆర్), మీడియం రేంజ్ చాఫ్ రాకెట్(ఎంఆర్సీఆర్), లాంగ్ రేంజ్ చాఫ్ రాకెట్(ఎల్ఆర్సీఆర్) రకాల స్వదేశీ వేరియంట్లను తయారు చేసినట్లు డీఆర్డీవో చెప్పింది. భారతీయ నౌకాదళ అవసరాలకు తగినట్లుగా వీటిని డిజైన్ చేశారు. ఆత్మనిర్బర్ భారత్ లక్ష్యంగా జోద్పూర్ ల్యాబ్ అడ్వాన్స్డ్ చాఫ్ టెక్నాలజీ ఆయుధాలను విజయవంతంగా తయారు చేసినట్లు డీఆర్డీవో చెప్పింది. అరేబియా సముద్రంలోని యుద్ధ నౌకపై మూడు రకాల చాఫ్ టెక్నాలజీ వేరియంట్లను పరిశీలించారు. వాటి పర్పార్మెన్స్ సంతృప్తికరంగా ఉందని కూడా తేల్చారు. శత్రదేశాల రేడార్, రేడియో ఫ్రీక్వెన్సీ నుంచి యుద్ధ నౌకలు తప్పించుకునేందుకు చాఫ్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.. డీఆర్డీవోకు కంగ్రాట్స్ తెలిపారు.