Sleep Banking | నేటి తరుణంలో సరిపడా నిద్ర పొందడం చాలామందికి పెద్ద సవాలుగా మారింది. ఉద్యోగ ఒత్తిడి, పరీక్షలు, రాత్రి షిఫ్టులు, ప్రయాణాలు వంటి కారణాల వల్ల నిద్రలేమి సమస్య పెరుగుతోంది. అయితే నిద్ర తగ్గే పరిస్థితులు ముందుగానే తెలిసినప్పుడు, దానికి శరీరాన్ని సిద్ధం చేసుకునే ఒక కొత్త పద్ధతి ఇప్పుడు ప్రాచుర్యం పొందుతోంది. దీనినే స్లీప్ బ్యాంకింగ్ అని పిలుస్తున్నారు. స్లీప్ బ్యాంకింగ్ అంటే ముందుగా కొన్ని రోజుల పాటు అదనంగా నిద్రపోవడం ద్వారా, తర్వాత వచ్చే నిద్రలేమి ప్రభావాన్ని తగ్గించుకోవడం. సాధారణంగా నిద్ర తగ్గిన తర్వాత దాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తాం. కానీ ఈ పద్ధతిలో మాత్రం ముందుగానే ఎక్కువ నిద్ర తీసుకుని శరీరానికి ఒక రకమైన రిజర్వ్ సిద్ధం చేస్తారు. దీంతో నిద్ర తక్కువగా ఉన్న రోజుల్లో కూడా మెదడు చురుకుదనం, ఏకాగ్రత కొంతవరకు నిలబడుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.
ఈ కాన్సెప్ట్‌ను 2009లో పరిశోధకులు పరిచయం చేశారు. ఒక అధ్యయనంలో కొంతమంది వ్యక్తులు కొన్ని రోజుల పాటు ప్రతిరోజూ ఎక్కువసేపు నిద్రపోయారు. తర్వాత వారందరికీ కొన్ని రోజుల పాటు చాలా తక్కువ నిద్ర మాత్రమే ఇచ్చారు. ముందుగా ఎక్కువ నిద్రపోయినవారిలో అలసట తక్కువగా ఉండటంతో పాటు, ఏకాగ్రత కూడా మెరుగ్గా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు, వారు మామూలు స్థితికి కూడా త్వరగా చేరుకున్నారని పరిశోధకులు వెల్లడించారు. నిద్ర అనేది కేవలం శరీరానికి విశ్రాంతి మాత్రమే కాదు. మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి, మానసిక స్థితి, రోగనిరోధక శక్తి వంటి అనేక అంశాలపై ఇది ప్రభావం చూపిస్తుంది. సరిపడా నిద్ర లేకపోతే ఏకాగ్రత తగ్గిపోవడం, స్పందన సమయం మందగించడం, చిరాకు పెరగడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముందుగానే అదనపు నిద్ర తీసుకోవడం శరీరానికి కొంత రక్షణగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
స్లీప్ బ్యాంకింగ్ వల్ల కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. నిద్ర తక్కువగా ఉన్నా చురుకుదనం కొంతవరకు కొనసాగడం, మానసిక స్థితి మెరుగ్గా ఉండడం, అలసట తగ్గడం, ఏకాగ్రత అవసరమైన పనుల్లో పనితీరు మెరుగుపడడం వంటి ప్రయోజనాలు కనిపిస్తాయి. ముఖ్యంగా వైద్యులు, నైట్ షిఫ్ట్ ఉద్యోగులు, తరచూ ప్రయాణాలు చేసే వారు, పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక స్లీప్ బ్యాంకింగ్‌ను అమలు చేయాలంటే ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. నిద్ర తగ్గే పరిస్థితికి ముందు 3 నుంచి 7 రోజుల పాటు ప్రతిరోజూ ఒకటి లేదా రెండు గంటలు అదనంగా నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి ఆలస్యంగా మేల్కొని ఉండటానికి బదులుగా ముందుగానే నిద్రించడం మంచిదని చెబుతున్నారు. అలాగే ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, పడుకునే ముందు మొబైల్, స్క్రీన్ టైమ్ తగ్గించడం, ప్రశాంతమైన వాతావరణంలో నిద్రపోవడం కూడా ముఖ్యమని సూచిస్తున్నారు.
అయితే స్లీప్ బ్యాంకింగ్‌ను శాశ్వత పరిష్కారంగా భావించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం తాత్కాలికంగా నిద్రలేమి ప్రభావాన్ని తగ్గించడంలో మాత్రమే సహాయపడుతుంది. దీర్ఘకాలంగా సరిపడా నిద్ర లేకపోతే వచ్చే ఆరోగ్య సమస్యలను ఇది పూర్తిగా నివారించలేదని చెబుతున్నారు. కాబట్టి ప్రతిరోజూ 7 నుంచి 9 గంటల నాణ్యమైన నిద్ర తీసుకోవడమే ఆరోగ్యానికి ఉత్తమమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా అదనపు నిద్ర తీసుకోవడం ద్వారా రాబోయే బిజీ రోజులలో శరీరం, మెదడు కొంత మెరుగ్గా పనిచేసే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ఇది ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లకు ప్రత్యామ్నాయం కాదని గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.