చెన్నై: ఒక బాలికకు తాగునీరు బదులు స్పిరిట్ (spirit) బాటిల్ ఇచ్చారు. స్పిరిట్ తాగిన ఆమె తీవ్ర అస్వస్థతకు గురై మరణించింది. తమిళనాడులోని మదురై ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ సంఘటన జరిగింది. తొమ్మిదేళ్ల బాలిక కిడ్నీ సమస్యతో బాధపడుతున్నది. మదురైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నది. కాగా, ఆ బాలిక తన తల్లిని మంచినీరు అడిగింది. అయితే బాలిక బెడ్ పక్కన ఉంచిన స్పిరిట్ బాటిల్‌ను వాటర్ బాటిల్‌గా తల్లి భావించింది. స్పిరిట్ బాటిల్ ఇవ్వడంతో అది తాగిన బాలిక తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయింది.
కాగా, ఆ బాలిక స్పిరిట్ తాగడం వల్ల చనిపోలేదని డాక్టర్లు తెలిపారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ ద్వారా ఇది తెలిసిందన్నారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆ బాలిక చాలా తక్కువగానే వాటర్ తాగుతుందని చెప్పారు. అయితే తాగేందుకు తల్లి ఇచ్చినది వాటర్ కాదు స్పిరిట్ అని గ్రహించిన ఆమె వెంటనే ఊసివేసిందన్నారు. దీంతో చాలా తక్కువగానే స్పిరిట్ తాగి ఉంటుందని తెలిపారు. దీని వల్ల ఆమె చనిపోలేదని చెప్పారు. మెదడులో రక్తస్రావం వల్ల ఆ బాలిక మరణించినట్లు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యలు వెల్లడించారు.