Gandhinagar: ఇండోర్ లో కలుషిత నీటి వల్ల పలువురు మృతి చెందిన ఘటన మరువక ముందే గుజరాత్ లోని గాంధీనగర్లో కూడా కలుషిత నీరు తాగి పలువురు అనారోగ్యం పాలయ్యారు. కలుషిత నీటి కారణంగా టైఫాయిడ్ కేసులు పెరుగుతున్నాయి. అక్కడి సివిల్ హాస్పిటల్ లో వంద మందికి పైగా పిల్లలు, పలువురు పెద్దలు చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరు తీవ్రమైన అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. మంచి నీటి సరఫరాకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ.. పలు చోట్లు లీకేజీలు, పైపు లైన్ల పగుళ్లతో మురికి నీరు చేరడంతో ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు అంటున్నారు.
ప్రస్తుతం కలుషిత నీరు తాగిన బాధితుల కోసం గాంధీ నగర్ సివిల్ హాస్పిటల్ లో ప్రత్యేక వార్డునే ఏర్పాటు చేశారంటే పరిస్థతి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు 80 మందితో 40 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. వీరిలో హెల్త్ వర్కర్స్, మున్సిపల్ హెల్త్ వర్కర్స్, ఆశా కార్యకర్తలు ఉన్నారు. ప్రస్తుతం సెక్టార్-24, సెక్టార్-28, అదివాలా ప్రాంతాల్లో కలుషిత నీటి సమస్య ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తంగా 10 వేల ఇండ్లకు సంబంధించి, 38,000 మంది ప్రజలపై ఈ ప్రభావం ఉందని అధికారులు తేల్చారు. అధికారులు ఈ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మరింతమంది అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు.
స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా గాంధీనగర్లో కోట్ల రూపాయలతో మంచి నీటి పైపులైన్లు ఏర్పాటు చేస్తున్నారు. అయినప్పటికీ, లీకేజీలు, డ్రైనేజీ నీరు కలవడం వంటి కారణాల వల్ల నీరు కలుషితమవుతోంది. కాగా.. ర్యాపిడ్ టీంలు జరిపిన సర్వేలో ఆయా ప్రాంతాల్లో నీరు తాగడానికి అనుకూలంగా లేదని తేలింది. కాగా.. వరుసగా కలుషిత నీటిని తాగడం వల్ల బాధితుల సంఖ్య మరింత పెరుగుతోందని వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రజలు తాగునీటిని వేడి చేసుకుని తాగాలని అధికారులు సూచిస్తున్నారు.