కాలం మారుతున్నా దేశంలో వరకట్న సమస్య మాత్రం చావడం లేదు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో రూ.5 లక్షల కట్నం ఇవ్వలేదనే కారణంతో భార్యకు నిప్పుపెట్టాడో భర్త. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని మండ్వాలీలో వెలుగు చూసింది. సదరు మహిళ వయసు 33 సంవత్సరాలని సమాచారం. ఈ సమాచారం అందుకున్న పోలీసులు.. బాధితురాలిని కలిసి స్టేట్మెంట్ తీసుకున్నారు.
40 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిపాలైన బాధితురాలు.. తన భర్త వినోద్ రూ.5 లక్షల కట్నం ఇవ్వాలని డిమాండ్ చేశాడని, దానికి నిరాకరించడంతో అత్తమామలతో కలిసి తనపై కిరోసిన్ పోసి నిప్పంటిచాడని తెలిపింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా లేదని, నెమ్మదిగా కోలుకుంటోందని పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలి మామను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆంటిసిపేటరీ బెయిల్పై అతన్ని విడుదల చేశారు. అయితే మిగతా కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నదీ తెలియలేదని, వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు.