పాట్నా: ఎన్డీఏ పాలనలో బీహార్ చతికిలపడింది. సంక్షేమ రాజ్యం కుప్పకూలడం రాష్ట్రవ్యాప్తంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. వంతెనలు కూలడం దగ్గర నుంచి పేదరికం, ఆకలి, ఉపాధి లేమి, ఆర్థిక వ్యవస్థ పతనం రాష్ర్టాన్ని తిరోగమనం పట్టించాయి. ‘డబుల్ ఇంజిన్’ పాలనతో రాష్ట్రం అభివృద్ధి బాట పట్టిస్తామన్న బీజేపీ, జేడీయూ నేతలు.. రాష్ర్టాన్ని అంతకంతకూ వెనక్కి నెట్టారు. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో బీజేపీ కూటమికి ఎదురుదెబ్బ తథ్యమని విశ్లేషకులు చెబుతున్నారు.
బీహార్‌లో వంతెనలు కూలడం సాధారణంగా మారింది. అగువాని-సుల్తాన్‌గంజ్ వంతెన నిర్మాణం 2014లో ప్రారంభమైంది, పదేళ్ల తర్వాత కూడా దీని నిర్మాణం కొనసాగుతూనే ఉంది. రూ.1,700 కోట్లతో నిర్మిస్తున్న ఈ వంతెన నిర్మాణంలో ఉండగానే చాలాసార్లు మధ్య మధ్యలో కూలిపోతున్నది. అవినీతి, నిర్లక్ష్యం, లోపభూయిష్టమైన, తప్పుడు విధానాలు ఈ దుస్థితికి దారి తీశాయి.
నీతి ఆయోగ్‌కు చెందిన ఎస్డీజీ (సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు) ఇండియా ఇండెక్స్ 2023-24 ప్రకారం, బీహార్ దేశంలోని అత్యంత దయనీయ స్థితిలో ఉన్న రాష్ట్రం. పేదరికం, ఆకలి, నాణ్యమైన విద్య, ఉపాధి, ఆర్థిక వృద్ధి వంటి సూచీల్లో బీహార్ దయనీయ స్థితిలో ఉంది. బీహార్ ప్రభుత్వం రెండేళ్ల క్రితం ప్రచురించిన కుల సర్వే నివేదిక ప్రకారం, రోజుకు రూ.200 కన్నా తక్కువ సంపాదిస్తున్న కుటుంబాలు రాష్ట్రంలో 94 లక్షలు ఉన్నాయి. ఎస్సీలు 43 శాతం మంది, ఎస్టీలు 43 శాతం మంది, అత్యంత తీవ్రంగా వెనుకబడిన తరగతులకు చెందినవారు 34 శాతం మంది, జనరల్ క్యాటగిరీకి చెందినవారు 25 శాతం మంది పేదరికంలో మగ్గిపోతున్నారు.
నిధుల కేటాయింపు జరిగింది కానీ అవి ఎక్కడికి పోయాయి? ప్రజా సేవల మెరుగుదలకు మాత్రం వెళ్లలేదు. ఈ సందర్భంగా పాఠశాలలు, దవాఖానల పరిస్థితిని గమనించాలి. రాష్ట్రంలోని 20,000కుపైగా పాఠశాలల్లో సరైన విద్యుచ్ఛక్తి సదుపాయం లేదు. 2 శాతం కన్నా తక్కువ పాఠశాలల్లో మాత్రమే డిజిటల్ లైబ్రరీలు ఉన్నాయి. స్కూల్ డ్రాప్‌ఔట్ రేట్ దేశంలోనే అత్యధికం.
అత్యధిక దవాఖానల్లో తగిన సంఖ్యలో వైద్యులు, స్పెషలిస్టులు లేరు. గ్రామీణ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది కొరత 90 శాతానికి చేరింది. ప్రతి ముగ్గురిలో ఇద్దరు మహిళలు ఎనిమిక్. తగినంత ఆహారం పొందుతున్న శిశువులు 11% కన్నా తక్కువ. ఐదేళ్ల లోపు వారిలో 40% మందికిపైగా వయసుకు తగినట్లుగా ఎదగడం లేదు.
యువతకు ఉద్యోగ, ఉపాధి, ఆదాయ అవకాశాలు లేకపోవడంతో గౌరవప్రదమైన జీవనం కోసం తమ ఇళ్లను వదిలిపోతున్నారు. యువతలో నిరుద్యోగం రెండంకెల సంఖ్యలో ఉంది. విద్యావంతులకు ఉద్యోగం దొరకడం కష్టంగా మారింది. ప్రతి ఐదుగురు గ్రాడ్యుయేట్లలో కనీసం ఒకరు ఉపాధి పొందలేకపోతున్నారు.
బీహార్ వంటి వ్యవసాయిక రాష్ట్రంలో విధానాలు రైతులకు మంచి ఆదాయాన్ని ఇచ్చేవిగా ఉండాలి. బాధ్యతాయుతమైన ప్రభుత్వం అయితే, ఫుడ్ ప్రాసెసింగ్, గోదాములు, కోల్డ్ స్టోరేజిలు వంటివాటిలో పెట్టుబడులు పెట్టి ఉండేది. గడచిన దశాబ్దంలో బీహార్‌లో 13 కోల్డ్ స్టోరేజిలు మాత్రమే వచ్చాయి. వ్యవసాయోత్పత్తులను అధిక విలువగల ఉత్పత్తులుగా మార్చలేకపోవడం వల్ల మఖానా, పండ్లు, కూరగాయల రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
రాష్ర్టానికి పెట్టుబడులు రాకపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి శాంతిభద్రతలు దయనీయస్థితిలో ఉండటం. ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా కొన్ని నెలల క్రితం పాట్నాలో హత్యకు గురయ్యారు. ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో దాదాపు ఎనిమిది మంది ప్రముఖ వ్యాపారవేత్తలు హింసాత్మక దాడులకు గురయ్యారు. 2021 నుంచి 2023 మధ్య కాలంలో నేరాలు 25 శాతం పెరిగాయి.