Supreme Court | పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పర్యాటకులకు భద్రత కల్పించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా పిటిషనర్‌ను సుప్రీంకోర్టు మందలించింది. సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ప్రయత్నించొద్దని చివరిసారే చెప్పామని.. అసలు మీ ఉద్దేశం ఏమిటి..? ఈ పిటిషన్లు దాఖలు చేయమని మిమ్మల్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు..? ఎలాంటి కారణం లేకుండా కేవలం ప్రచారం కోసమే పిటిషన్‌ను దాఖలు చేశారంటూ కోర్టు మండిపడింది. కేసు సున్నితత్వాన్ని అర్థం చేసుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని దాడి జరగడం ఇదే తొలిసారని, అందుకే పర్యాటకులకు మెరుగైన భద్రత కల్పించాలనేది మా ఉద్దేశమని పిటిషనర్ ధర్మాసనానికి తెలుపగా.. అయినా ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు అంగీకరించకుండా.. పిటిషనర్ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు చనిపోయిన విషయం తెలిసిందే. ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన న్యాయవాది విశాల్ తివారీని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం తప్పుపట్టింది.
ప్రచారం కోసమే పిటిషన్ వేశారని అసంతృప్తిని వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ ‘మీరు ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఎందుకు దాఖలు చేశారు? మీ అసలు ఉద్దేశం ఏంటీ? ఈ సమస్య సున్నితత్వం మీకు అర్థం కాలేదా? మీరు దేశం పట్ల కొంత బాధ్యతతో మెలగాలి. ఇదేనా మార్గం.. దయచేసి ఇలా చేయకండి. పదవీ విరమణ చేసిన హైకోర్టు లేదంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎప్పటి నుంచి ఇలాంటి అంశాలను (ఉగ్రవాదం) దర్యాప్తు చేయడానికి నిపుణులుగా మారారు? మేం దేనినీ అంగీకరించడం లేదు. దయచేసి మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో అక్కడికి వెళ్లండి’ అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. తాజాగా విశాల్ తివారీ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్, ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను తోసిపుచ్చింది. పిటిషనర్ ప్రజా ప్రయోజనాలకు సేవ చేయాలనే ఉద్దేశం లేకుండా కేవలం పబ్లిసిటీ కోసమే వెంట వెంటనే పిటిషన్లు దాఖలు చేస్తున్నాడని.. అలాంటి పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రజల పట్ల నిజమైన ఆందోళన ఏదీ కనిపించడం లేదని, పబ్లిసిటీ పొందేందుకు ఈ పిటిషన్ వేసినట్లుగా ఉందని సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఇందులో న్యాయపరమైన జోక్యం అవసరం లేదని స్పష్టం చేసింది.