Mohan Bhagwat : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) ను రాజకీయ కోణంలో చూడటం అతిపెద్ద తప్పు అని, సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) అన్నారు. బీజేపీతో ఆరెస్సెస్‌ను పోల్చడం, రాజకీయ కోణంలో చూడడంతో ప్రజల్లో తరచు అపార్థాలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఆరెస్సెస్ శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా కోల్‌కతాలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
నైతిక విలువలు సామాజిక బాధ్యత కలిగిన సంఘ్సేవక్లను సృష్టించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని, బలమైన దేశాన్ని నిర్మించడానికి తాము నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. ఆరెస్సెస్ గురించి తమ అభిప్రాయం చెప్పే హక్కు దేశంలోని ప్రతివ్యక్తికి ఉందని, కానీ అది వాస్తవికత ఆధారంగా ఉండాలని భగవత్ అన్నారు.
సంఘ్‌కు ఎలాంటి రాజకీయ అజెండా లేదని, దేశమే తొలి ప్రాధాన్యం అన్న సిద్ధాంతాన్ని పాటిస్తూ పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు తమ కార్యకర్తలు పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. సంఘ్ చేస్తున్న ఈ కృషితో భారత్ మళ్లీ విశ్వగురువుగా మారుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు.