Jammu Kashmir | శ్రీనగర్, మే 11: సరిహద్దు గ్రామాల ప్రజలు అప్పుడే ఇండ్లకు తిరిగి రావొద్దని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని జమ్ముకశ్మీర్ పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ డ్రోన్ దాడులు, కాల్పులకు తెగబడటంతో నియంత్రణ రేఖ వెంబడి బారాముల్లా, బందిపొర, కుప్వారా జిల్లాల్లోని 1.25 లక్షల కంటే ఎక్కువ మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాడులకు తెగబడిన సమయంలో పాక్ ప్రయోగించిన మిస్సైల్స్, పేలుడు అవశేషాలను తొలగించాల్సి ఉందని పేర్కొన్నారు. ముందుగా బాంబు నిర్వీర్య బృందాలను ఆయా గ్రామాలకు పంపి ప్రజల ప్రాణాలకు నష్టం కలిగించే పేలుడు పదార్థాలు, ఫిరంగి గుండ్లను తొలగిస్తామని వెల్లడించారు. 2023లో నియంత్రణ రేఖ వెంబడి ఇలా మిగిలిపోయిన షెల్స్ వల్ల 41 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు గుర్తు చేశారు.
సరిహద్దు రాష్ర్టాలు ప్రశాంతం..
కాల్పుల మోతలు.. ఫిరంగుల శబ్దాలు.. డ్రోన్ల చప్పుళ్లతో దద్దరిల్లిన నియంత్రణ రేఖ శాంతించింది. సరిహద్దు రాష్ర్టాలైన జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లో ఆదివారం ప్రశాంత వాతావరణం కనిపించింది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆందోళన చెందిన సరిహద్దు గ్రామాల ప్రజలకు ఉపశమనం లభించింది. కాల్పుల విరమణ ప్రకటన వెలవడిన తర్వాత కూడా శనివారం రాత్రి కొద్ది గంటల పాటు జమ్ముకశ్మీర్లో పాకిస్థాన్ ఉల్లంఘనలకు పాల్పడుతూ డ్రోన్లను ఎగరేసినప్పటికీ తెల్లవారేసరికి అంతటా ప్రశాంతంగానే ఉందని పోలీసు అధికారులు తెలిపారు.