బెంగళూరు, నవంబర్ 29: చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లను ముప్పుతిప్పలు పెడుతున్న కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులపై అక్టోబర్ 30న ఇచ్చిన తీర్పును అమలు చేయని ప్రభుత్వ సంస్థపై దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్లో కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం.. బిల్లులు చెల్లించకపోవడంతో ఇప్పటికే ఇద్దరు కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారని, ఇక ముందు ఇది ఎంతమాత్రం కొనసాగరాదని చీఫ్ జస్టిస్ ప్రసన్న బి వరాలే, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని కోర్టు ఆదేశించినా పట్టించుకోవడం లేదంటూ బృహత్ బెంగళూరు మహానగర పాలికపై మెస్సర్స్ నిక్షేప్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వేసిన కోర్టు ధిక్కారణ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం బిల్లుల చెల్లింపులో అసాధారణ జాప్యాన్ని తప్పుబట్టింది. ఈ కేసుకు సంబంధించి గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు, సూచనలు పాటించాలని, ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని ఆదేశిస్తూ డిసెంబర్ 13కు కేసును వాయిదా వేసింది.