లండన్: వాణిజ్య యుద్ధం నేపథ్యంలో అమెరికా, భారత్ మధ్య సంబంధాలు బలహీనపడ్డ విషయం తెలిసిందే. అయితే ప్రధాని మోదీపై మాత్రం ట్రంప్(Donald Trump ) తన ప్రశంసలను ఆపడం లేదు. ప్రధాని మోదీకి తాను సన్నిహితంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. సెప్టెంబర్ 17వ తేదీన మోదీ బర్త్‌డే సందర్భంగా ఆయనతో ఫోన్లో మాట్లాడినట్లు ట్రంప్ వెల్లడించారు. ఇండియాకు చాలా దగ్గరగా ఉన్నానని, ప్రధాని మోదీ కూడా తనకు దగ్గరి వ్యక్తే అని, ఫోన్లో మాట్లాడి బర్త్‌డే విషెస్ చెప్పినని, తమ మధ్య మంచి సంబంధాలు ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ విషయాన్ని చెప్పడం గమనార్హం.
రష్యా వద్ద ఇంధనం కొంటున్న భారత్‌పై అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ఇటీవల ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే. భారతీయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను అమెరికా 50 శాతానికి పెంచడంతో రెండు దేశాల మధ్య ప్రచ్ఛన్న వాణిజ్య యుద్ధం సాగుతోంది. అయితే ద్వైపాక్షిక చర్చల ద్వారా వాణిజ్య సమస్యలను పరిష్కరించుకోనున్నట్లు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వీ అనంత నాగేశ్వరన్ తెలిపారు.