న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆశించినట్లుగా ఆయనకు నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు. నోబెల్ కమిటీ ఆయన ప్రతిపాదనలను తిరస్కరించింది. వెనిజులా ప్రతిపక్ష నేత మారియాకు ఈ యేటి నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. యుద్ధాలు ఆపినట్లు చెప్పుకుంటున్న ట్రంప్‌కు ఓస్లోలోని నోబెల్ కమిటీ ఎందుకు మొండిచెయ్యి చూపిందో స్పష్టంగా తెలియదు. కానీ ట్రంప్ బృందం మాత్రం ఏడు ప్రదేశాల్లో యుద్ధాలను నివారించినట్లు చెబుతోంది. కంబోడియా-థాయిల్యాండ్ మద్య బోర్డర్ ఘర్షణలకు బ్రేక్ వేసినట్లు చెప్పింది. కొసావో, సెర్బియా మధ్య 2020 డీల్ కుదిరేలా చేసిందన్నారు. కాంగో, రువాండ మధ్య శాంతి ఒప్పందం కుదుర్చామన్నారు. ఇండోపాక్ ఉద్రిక్తతలను కూడా తగ్గించింది తామే అని ట్రంప్ చెప్పుకుంటున్నారు. కానీ భారత ప్రభుత్వం దీన్ని ఖండిస్తున్నది. ఇక ఇజ్రాయిల్; ఇరాన్ మధ్య 12 రోజుల ఘర్షణకు కాల్పుల విరమణ ప్రకటించేలా చేసింది తానే అని ట్రంప్ చెప్పారు. ఈజిప్ట్, ఇథియోపియా మధ్య నైల్ డ్యామ్ అంశంలో చెలరేగిన వివాదాన్ని పరిష్కరించింది తానేనన్నారు. అర్మేనియా, అజర్బైజాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరేలా చేసింది తామే అని వైట్‌హౌజ్ చెబుతోంది. వాస్తవానికి కొన్ని ఒప్పందాల్లో ఇంకా ప్రోగ్రెస్ జరుగుతోంది.
నోబెల్ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియను పరిశీలిస్తే, దాన్ని బట్టి ట్రంప్‌కు అవకాశాలు చాలా స్పలంగానే ఉన్నాయి. ఆ అవార్డులకు జనవరి 31వ తేదీ డెడ్‌లైన్. దీంతో టెక్నికల్‌గా ట్రంప్ ఆ అవార్డులకు అర్హులయ్యే ఛాన్సు తక్కువే. ఎందుకంటే ట్రంప్ సాధించిన విజయాలన్నీ ఆ తర్వాత చోటుచేసుకున్నవే. చాలా మంది ప్రపంచనేతలు ట్రంప్‌కు మద్దతు పలికినా… నోబెల్ కమిటీ మాత్రం అమెరికా అధ్యక్షుడిని పక్కనపెట్టేసింది. ఈ యేటి శాంతి పురస్కారం ప్రకటన రాగానే వైట్‌హౌజ్ స్పందించింది. శాంతి ఒప్పందాలు కుదుర్చుకోవడాన్ని ఆపబోమని, యుద్ధాలను ఆపుతామని, ప్రజల ప్రాణాలను రక్షిస్తామని అమెరికా ప్రకటించింది. కానీ నోబెల్ కమిటీ మాత్రం శాంతిని వదిలేసి రాజకీయాలకు పెద్దపీట వేసిందని వైట్‌హౌజ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీఫెన్ చెంగ్ తెలిపారు.
నోబెల్ పీస్ ప్రైజ్ ప్రకటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తజకిస్తాన్‌లో ఆయన ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. శాంతి కోసం శ్రమించనివాళ్లకు నోబెల్ కమిటీ గతంలో పీస్ ప్రైజ్‌ను ఇచ్చారని అన్నారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు నోబెల్‌కు అర్హుడో కాదో చెప్పలేను, కానీ సుదీర్ఘ సమస్యలకు ట్రంప్ పరిష్కారం చేశారని పుతిన్ అన్నారు. యుద్ధాలను ఆపుతున్నట్లు ట్రంప్ చెబుతున్నా.. నోబెల్ కమిటీ మాత్రం శాంతి విజన్ కలిగిన మారియా కొరినాకు పురస్కారాన్ని ప్రకటించింది. నిజానికి ట్రంప్ తన మొదటి పాలన సమయంలో వెనిజులా ప్రతిపక్ష నేత జువాన్ గుయిడోకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆ దశలో మారియా కోరినా డెమోక్రటిక్ పార్టీతో సన్నిహితంగా ఉన్నారు. అయితే మారియాకు అవార్డు ఇవ్వడం వల్ల ట్రంప్ రెండు జట్కాలు ఇచ్చారని నిపుణులు అంటున్నారు. ఆయనకు అవార్డును ఇవ్వకపోవడమే కాకుండా, ఓ లిబరల్ నేతకు అవార్డు ఇచ్చారని విమర్శిస్తున్నారు. పీస్ ప్రైజ్ ఎప్పుడో పొలిటికల్ అవార్డుగా మారిపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
వెనిజులా, అమెరికా మధ్య రిలేషన్ ఓ రకంగా అండర్కరెంట్లా సాగుతోంది. తమపై అమెరికా ఆధిపత్యం చెలాయిస్తున్నదని వెనిజులా ఆరోపిస్తున్నది. కానీ మారియోకు అవార్డు ఇవ్వడమంటే అది ట్రంప్ కు ఇచ్చినట్లే అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో కొరియాకు మంచి రిలేషన్ ఉన్నది. వెనిజులాలో నికోలస్ మాడురో నియంతృత్వ అధికారాన్ని అంతం చేయాలన్నదే అమెరికా ధ్యేయం. దానిలో భాగంగానే కొరియోకు అవార్డు దక్కేలా చేశారన్నది ఓ వాదన. ట్రంప్‌కు అవార్డు ఇవ్వకపోవడం అంటే ఆయన్ను పక్కనపెట్టడం కాదు.. ఇదో బ్యాలెన్సింగ్ చర్య అని నిపుణులు అంచనా వేస్తున్నారు.
యుద్ధాలను ఆపినట్లు ట్రంప్ చెబుతున్నా.. నియంతృత్వ వ్యవస్థలను అడ్డుకుంటున్న మారియా కొరియా లాంటి కార్యకర్తలు, సంస్కర్తలకే నోబెల్ కమిటీ గుర్తింపు ఇస్తూ వచ్చింది. కానీ అమెరికా, వెనిజులా దృష్టిలో ఈ అవార్డుకు ఉన్న ప్రత్యేకత విశేషమైంది. ఇటీవల వెనిజులా డ్రగ్ వ్యాపారాన్ని అమెరికా పూర్తిగా దెబ్బతీసింది. పీస్‌మేకర్ టైటిల్ తో ట్రంప్ పీస్ ప్రైజ్ కోసం ట్రై చేస్తున్నా.. ఆయన ప్రయత్నాలు భవిష్యత్తులో ఫలించే అవకాశం ఉన్నట్లు కొందరంటున్నారు. వచ్చే ఏడాది కూడా ట్రంప్‌ను నామినేట్ చేసే అవకాశాలు ఉన్నట్లు అంటున్నారు.
ట్రంప్ సాధించిన విజయాలపై వచ్చే ఏడాదైనా నోబెల్ కమిటీ మళ్లీ సమీక్షించడం ఖాయం. నిజానికి ఆల్ఫ్రెడ్ నోబెల్ కలలు కన్నది యుద్ధం లేని సమాజం. ఆ దిశగా ట్రంప్ ప్రయత్నించినట్లు అనిపించినా ఆయకు ఆ సత్కారం దక్కలేదు. కానీ ఏ పద్ధతిలోనైనా యుద్ధాల్ని ఆపడమే ఉత్తమం. ఆ రకంగా ఆలోచిస్తే ట్రంప్ అర్హుడే అవుతాడు. ఒకవేళ కమిటీ పునరాలోచన చేస్తే, ఆ అవార్డు ట్రంప్‌కు దక్కే అవకాశాలు కూడా మెండుగానే ఉన్నాయి.