న్యూయార్క్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump). తాజాగా ఉక్రెయిన్‌పై భీకర స్థాయిలో రష్యా తన డ్రోన్లు, మిస్సైళ్లతో దాడి చేసింది. ఈ నేపథ్యంలో మీడియాతో ట్రంప్ స్పందిస్తూ.. పుతిన్ అనుసరిస్తున్న విధానాల పట్ల అసంతృప్తితో ఉన్నట్లు పేర్కొన్నారు. అతనికి ఏమైంది? అనేక మంది ప్రాణాలు బలి తీసుకుంటున్నాడు.. పుతిన్‌కు పిచ్చి పట్టిందా అని ట్రంప్ ఫైర్ అయ్యారు. ఏ కారణం లేకుండానే రష్యా దాడులు చేస్తున్నట్లు ఆరోపించారు.
గత వారం రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడుల్ని ఉదృతం చేసింది. సుమారు 764 ఉక్రెయిన్ డ్రోన్లను రష్యా తన భూభాగంలోనే అడ్డుకున్నది. కుర్క్స్ ప్రాంతంలో పర్యటిస్తున్న సమయంలో అధ్యక్షుడు పుతిన్ హెలికాప్టర్ చుట్టూ డ్రోన్ దాడి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి బదులుగానే రష్యా మిలిటరీ.. ఉక్రెయిన్‌పై అటాక్ చేసింది. కీవ్‌లో ఉన్న డ్రోన్, మిస్సైల్ ప్రొడక్షన్ ప్లాంట్‌పై దాడి చేశారు.
ఆదివారం రష్యా జరిపిన డ్రోన్ దాడిలో 12 మంది మృతిచెందారు. సుమారు 367 డ్రోన్లు, మిస్సైళ్లతో రష్యా అటాక్ చేసింది. డ్రోన్లు, మిస్సైళ్ల దాడి సయమంలో ఉక్రెయిన్‌లోని కీలక ప్రాంతాల్లో ఎయిర్ సైరన్లు మోగాయి. న్యూజెర్సీలో రిపోర్టర్లతో మాట్లాడుతూ.. చాన్నాళ్ల నుంచి పుతిన్ తెలుసు అని, నగరాలు, ప్రజలపై రాకెట్లను వదులుతున్నాడని, దీన్ని ఇష్టపడడం లేదని ట్రంప్ తెలిపారు. పుతిన్ క్రేజీగా మారినట్లు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రుత్‌లో పేర్కొన్నారు.