న్యూఢిల్లీ, జూలై 22: హెచ్-1బీ వీసాల కేటాయింపులో గణనీయమైన మార్పులు తీసుకురావాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం అనుసరిస్తున్న లాటరీ పద్ధతికి స్వస్తి పలికి, ప్రతిభ ఆధారంగా వీసాలు కేటాయించాలని భావిస్తున్నది. ఏటా చట్టబద్ధమైన కోటా కింద 85,000 హెచ్-1బీ వీసాల మంజూరు జరుగుతోంది. వీటిలో అత్యధిక భాగం అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ కంపెనీలకే దక్కుతున్నాయి. ఇందుకు కారణం ఈ కంపెనీలు పెద్ద సంఖ్యలో దాఖలు చేసే దరఖాస్తులే.
ప్రస్తుత లాటరీ విధానాన్ని పాలసీ నిపుణులు చాలాకాలం నుంచి వ్యతిరేకిస్తున్నారు. లాటరీ సిస్టమ్ స్థానంలో జీతం లేదా అనుభవం ఆధారంగా దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవడం వల్ల హెచ్-1బీ వీసా ఆర్థిక విలువ 88 శాతం పెరుగుతుందని ఇన్స్టిట్యూట్ ఫర్ ప్రోగ్రెస్ తన తాజా నివేదికలో పేర్కొంది. అధిక జీతం లేదా అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ప్రపంచంలోని నైపుణ్యం అమెరికాకు వచ్చి అమెరికన్ పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుందని ఎకనమిక్ ఇన్నోవేషన్ గ్రూపునకు చెందిన కానర్ ఓబ్రియన్ అభిప్రాయపడ్డారు.
కాగా, ప్రతిపాదిత మార్పునకు ఎటువంటి కాలవ్యవధిని నిర్ణయించలేదు. వచ్చే ఏడాదికి చెందిన దరఖాస్తులకు దీన్ని వర్తింప చేస్తారా అన్న విషయాన్ని కూడా డీహెచ్ఎస్ ధ్రువీకరించలేదు. ఏదేమైనా రానున్న విద్యా సంవత్సరానికి ఇప్పటికే హెచ్-1బీ వీసా కార్యక్రమం ప్రక్రియ కొనసాగుతున్నందున తక్షణమే ఇది అమలులోకి వచ్చే అవకాశం లేదు.