భోపాల్: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ దవాఖానాల నిర్వహణ దారుణంగా ఉంది. రోగాల బారిన పడినవారికి చికిత్స మాట ఎలా ఉన్నా, కొత్త రోగాలు వచ్చేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఖాండ్వా జిల్లా, కిల్లాడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పడకలపై ఇటీవల శునకాలు సేదదీరుతుండటాన్ని చూసిన రోగులు భయకంపితులయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
దీంతో అధికారులపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జిల్లా వైద్యాధికారి స్పందించి దవాఖాన క్లీనర్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. డ్యూటీ నర్స్‌కు ఏడు రోజుల జీతం తగ్గించనున్నట్లు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ రిషవ్ గుప్తా స్పందిస్తూ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించారు.