లక్నో: రెండు కుక్కలకు ఘనంగా పెళ్లి చేశారు. బ్యాండ్ మేళంతో హోరెత్తించి డ్యాన్సులు చేశారు. వేడుకగా బారాత్ నిర్వహించడంతోపాటు పొరుగింటి కుక్కలకు భారీ విందు కూడా ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో ఈ వింత సంఘటన జరిగింది. టామీ అనే మగ కుక్కకు ఏడు నెలల ఆడ కుక్క జెల్లీతో వివాహం చేయాలని వాటి యజమాన కుటుంబాలు నిర్ణయించాయి. జనవరి 14న పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ఆ రోజున వరుడు టామీతో కలిసి ఆ కుటుంబం అట్రౌలీలోని తిక్రి రాయ్‌పూర్ నుంచి వధువు జెల్లీ యజమాన కుటుంబం ఉండే అలీగఢ్‌లోని సుఖ్రావలి గ్రామానికి ఊరేగింపుగా వచ్చారు. బ్యాండ్ మేళాలు హోరెత్తగా ఇరు కుటుంబాల వారు డ్యాన్సులు చేశారు.
అనంతరం టామీ నుదట తిలకం పెట్టారు. టామీతోపాటు జెల్లీ మెడలో పూలమాలలు వేసి ఘనంగా పెళ్లి జరిపించారు. ఆ తర్వాత నెయ్యితో తయారు చేసిన వంటకాలను కొత్త దంపతులైన కుక్కల జంటకు వడ్డించారు. ఆ ప్రాంతంలోని పొరుగింటి కుక్కలకు కూడా విందు ఇచ్చారు. ఆ తర్వాత వీడ్కోలు కార్యక్రమం కూడా నిర్వహించారు.
కాగా, సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆడ, మగ కుక్కలకు పెళ్లి జరిపించినట్లు టామీ యజమాని దినేశ్ మీడియాకు తెలిపారు. ఈ పెంపుడు కుక్కల పెళ్లి కోసం సుమారు రూ.45,000 ఖర్చు చేసినట్లు వెల్లడించారు. మరోవైపు ఈ కుక్కల పెళ్లి వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | A male dog, Tommy and a female dog, Jaily were married off to each other in UP's Aligarh yesterday; attendees danced to the beats of dhol pic.twitter.com/9NXFkzrgpY
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 15, 2023