న్యూఢిల్లీ, డిసెంబర్ 16: దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు చెందిన 80 ఏండ్ల నాటి పత్రాలు, లేఖలపై వివాదం రాజుకుంది. ఈ పత్రాలను తిరిగి అప్పగించాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రుల మ్యూజియం, గ్రంథాలయం(పీఎంఎంల్) కోరింది. ఈ మేరకు సెప్టెంబర్‌లో సోనియా గాంధీకి, ఈ నెల 10న రాహుల్ గాంధీకి పీఎంఎంఎల్ సభ్యుడు రిజ్వాన్ కద్రి లేఖలు రాశారు. నెహ్రూకు చెందిన లేఖలను పీఎంఎంఎల్కు తిరిగి అప్పగించాలని లేదా జిరాక్స్‌లు కానీ, స్కాన్డ్ కాపీలు కానీ ఇవ్వాలని రాహుల్ గాంధీని పీఎంఎంల్ సభ్యులు రిజ్వాన్ కద్రి కోరారు. ఇవి పీఎంఎంఎల్‌లో ఉంటే పరిశోధకులకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కాగా, రిజ్వాన్ లేఖపై సోనియా, రాహుల్ నుంచి స్పందన రాలేదని తెలుస్తున్నది.
20వ శతాబ్ధపు దేశ, విదేశీ ప్రముఖులకు నెహ్రూ రాసిన ఉత్తరాలను పీఎంఎంఎల్ నుంచి తీసుకెళ్లారని కద్రి పేర్కొన్నారు. భారతదేశ చివరి బ్రిటన్ వైశ్రాయ్ మౌంట్‌బాటన్ భార్య ఎడ్వినా మౌంట్‌బాటన్, శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌తో పాటు జయప్రకాశ్ నారాయణ్, పద్మజ నాయుడు, విజయలక్ష్మీ పండిత్, అరుణ అసఫ్ అలీ, బాబు జగ్జీవన్‌రామ్, గోవింద్ వల్లభ్ పంత్ వంటి ప్రముఖులకు నెహ్రూ రాసిన ఉత్తరాలు ఇందులో ఉన్నట్టు కద్రి తెలిపారు. 51 డబ్బాల్లో ఉన్న ఈ లేఖలను నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ(ఎన్ఎంఎంఎల్)కి 1971లో జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్ అప్పగించింది. 2008లో సోనియా గాంధీ విజ్ఞప్తి మేరకు వీటిని ఎన్ఎంఎంఎల్ ఆమెకు అప్పగించినట్టు తెలుస్తున్నది. ఎన్ఎంఎంఎల్ను అందరి మాజీ ప్రధానుల మ్యూజియంగా విస్తరించి ఇటీవల కేంద్రం పీఎంఎంఎల్‌గా పేరు మార్చిన సంగతి తెలిసిందే.
రిజర్వేషన్లపై రాష్ర్టాలకు నెహ్రూ రాసిన లేఖపై ప్రధాని మోదీ వాస్తవాలను వక్రీకరించారని, దేశాన్ని తప్పుదోవ పట్టించారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. మోదీ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యా ంగంపై చర్చ సందర్భంగా.. 1947-52 మధ్య ఎన్నికైన ప్రభుత్వం లేకపోయినా కాంగ్రెస్ అక్రమంగా రాజ్యాంగాన్ని సవరించిందని, ఇందుకోసం రాష్ర్టాలకు నెహ్రూ లేఖలు రాశారని మోదీ ఆరోపించారు. అయితే, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల కోసమే రాజ్యాంగ సభ సభ్యులు రాజ్యాంగ సవరణ చేశారని, ఇందుకోసమే సీఎంలకు నెహ్రూ లేఖ రాశారని ఖర్గే చెప్పారు.
నెహ్రూ లేఖలను దాచేందుకు గాంధీ కుటుంబం ఎందుకు ప్రయత్నిస్తున్నదో దేశానికి తెలియాలని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర పేర్కొన్నారు. ఇవేమీ వ్యక్తిగత ఆస్తులు కాదని, దేశానికి చెందిన చారిత్రక పత్రాలని ఆయన అన్నారు. ఈ ఉత్తరాలు ప్రజల్లో ఉండొద్దని గాంధీ కుటుంబం ప్రయత్నిస్తుండటానికి కారణమేంటని? వాటిల్లో ఏముంది? అని ఆయన ప్రశ్నించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆత్మకథ నుంచి కొంత భాగాన్ని సైతం పాత్ర షేర్ చేశారు. ‘నెహ్రూను లార్డ్ మౌంట్‌బాటన్ బాగా ఆకట్టుకున్నాడు. బహుశా లేడీ మౌంట్‌బాటన్ ప్రభావం అంతకంటే ఎక్కువే ఉండొచ్చు’ అని అందులో రాసి ఉంది. తద్వారా నెహ్రూ, ఎడ్వినా మౌంట్‌బాటన్ మధ్య సంబంధాన్ని పాత్ర పరోక్షంగా ప్రశ్నించారు.