Girl Child | భోపాల్: ఓ ఆడ శిశువు జన్మించిన వెంటనే ఆ పాప బామ్మ నిర్దయగా గొంతు కోసి, చెత్త డబ్బాలో పడేసింది. కానీ మానవత్వం ఉన్న మనుషుల కారణంగా ఆ చిన్నారి మృత్యుంజయురాలిగా నిలిచింది. మధ్యప్రదేశ్ రాజ్‌గఢ్‌లో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రాజ్‌గఢ్ పట్టణంలో ఓ మహిళ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే ఆమె బామ్మ ఆ శిశువు గొంతు కోసి, చెత్త డబ్బాలో పడేసింది. రక్తమోడుతున్న ఆ పసికందును ఆ దారిన పోయేవారు చూసి చలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ పసికందును మొదట జిల్లా ప్రభుత్వ దవాఖనకు, ఆ తర్వాత భోపాల్‌లోని కమలా నెహ్రూ దవాఖానకు తరలించారు. దవాఖాన హెచ్ఓడీ మాట్లాడుతూ, ఆ పసికందుకు పిహు అని పేరు పెట్టినట్లు తెలిపారు. ఆమెకు గాయమైనప్పటికీ, ముఖ్యమైన నరాలకు దెబ్బ తగలలేదని చెప్పారు. నెల రోజులకుపైగా శ్రమించి ఆ చిన్నారికి వైద్యం చేశామని.. ప్రస్తుతం ఆ శిశువు ప్రాణాపాయం నుంచి తప్పించుకుందని తెలిపారు. ఆమెను బాలల సంక్షేమ కమిటీ అనుమతితో రాజ్‌గఢ్‌లోని ఓ షెల్టర్ హోమ్‌కు అప్పగించామన్నారు. పసికందుపై హత్యాయత్నం చేసి, ఆమెను వదిలిపెట్టినందుకు ఆమె తల్లి, బామ్మలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.