Rajouri | జమ్ము కశ్మీర్లోని రాజౌరీ (Rajouri ) జిల్లాలో అంతుచిక్కని వ్యాధి (mysterious illness) ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి ఆ రహస్య వ్యాధి వల్ల సుమారు 17 మంది మరణించారు. బదాల్ గ్రామంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రం స్టడీ చేస్తున్నది. మెడికల్ అలర్ట్ నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి సెలవులు రద్దు చేశారు (Doctors leaves cancelled).
రాజౌరి ప్రభుత్వ కళాశాల ఆసుపత్రి ప్రిన్సిపాల్ డాక్టర్ అమర్జీత్ సింగ్ భాటియా (Dr Amarjeet Singh Bhatia) శుక్రవారం విలేకరుల సమావేశంలో ఈ మేరకు ప్రకటించారు. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా వైద్యులు, పారామెడికల్ సిబ్బంది (paramedic staff) సెలవులను రద్దు చేసినట్లు వెల్లడించారు. నెలన్నర వ్యవధిలో మూడు కుటుంబాలకు చెందిన 17 మంది అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు చెప్పారు. మెడికల్ అలర్ట్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు తాజా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 10 మంది వైద్య విద్యార్థులను రాజౌరికి డిప్యూట్ చేసినట్లు వెల్లడించారు.
కాగా, డిసెంబర్ ఏడవ తేదీ నుంచి బదాల్ గ్రామంలో మూడు కుటుంబాలకు చెందిన 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో అయిదు మంది పరిస్థితి విషమంగా ఉన్నది. బాధితులు న్యూరో సంబంధిత లక్షణాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఆ పేషెంట్లలో కేంద్ర నాడీ వ్యవస్థతో పాటు మెదడు కూడా డ్యామేజ్ అవుతున్నట్లు పసికట్టారు.
మృతులతో కాంటాక్టులోకి వచ్చిన సుమారు 300 మందిని క్వారెంటైన్ చేశారు. రాజౌరీలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వాళ్లను క్వారెంటైన్ చేశారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కనిపించని శత్రువుతో యుద్ధం జరుగుతున్నట్లు స్థానిక డాక్టర్లు తెలిపారు. సంక్షోభాన్ని ఎదుర్కొనే రీతిలో చర్యలు తీసుకుంటున్నట్లు రాజౌరీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ అమర్జీత్ సింగ్ భాటియా తెలిపారు.
ప్రభావిత ప్రాంతాన్ని మాస్క్ లేకుండా విజిట్ చేశానని, తనకు ఎటువంటి అనారోగ్యం కలగలేదని డాక్టర్ భాటియా స్పష్టం చేశారు. వైరల్, బ్యాక్టీరియా, ప్రోటోజోవా, జూనాటిక్ సంక్రమణలు జరగడంలేదన్నారు. స్థానికులు ఎవరూ ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. మృతుల శరీరాల్లో కాడ్మియం ఆనవాళ్లు ఉన్నట్లు ప్రాథమిక అంచనా ద్వారా తెలుస్తోందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
లక్నోలోని టాక్సికాలజీ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన పరీక్షల్లో.. మృతుల శరీరాల్లో కాడ్మియం ఉన్నట్లు గుర్తించామన్నారు. అయితే వారి శరీరాల్లోకి కాడ్మియం మూలకం ఎలా ఎంటరైందన్న కోణంలో విచారణ సాగుతోందన్నారు. కాడ్మియం చాలా విషపూరితమైన ఖనిజం. ఒకవేళ దాన్ని కడుపులోకి తీసుకున్నా.. లేక పీల్చినా.. దాని వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయి. కలుషిత గాలి, ఆహారం, నీటి వల్ల కాడ్మియం శరీరంలోకి వచ్చే ఛాన్సు ఉన్నది.
Also Read..
“Mysterious Deaths | కశ్మీర్లో అనుమానాస్పద మరణాలు.. దర్యాప్తునకు కేంద్ర బృందం..!”
“Rajouri: కశ్మీర్లోని రాజౌరీలో అంతుచిక్కని వ్యాధి.. మృతుల శరీరాల్లో కాడ్మియం ఆనవాళ్లు”
“అంతుబట్టని వ్యాధితో 8 మంది బాలల మృతి”