భోపాల్: మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో 11 మంది చిన్నారుల మృతికి కారణమైన దగ్గు మందు రాసిన డాక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ (Coldrif syrup) తాగిన పక్షం రోజుల్లోనే చిన్నారులు కిడ్నీ ఫెయిల్ అయి మృతిచెందారు. ఈ నేపథ్యంలో కాఫ్ సిరప్ సూచించిన డాక్టర్ ప్రవీణ్ సోనీని పరాసియా ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్లు భోపాల్ పోలీసులు ఆదివారం ఉదయం ప్రకటించారు. ప్రభుత్వ డాక్టర్ అయిన ప్రవీణ్ (Praveen Soni).. చింద్వారాలో (Chhindwara) ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్నారు. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల నుంచి చికిత్స కోసం తన వద్దకు వచ్చిన చిన్నారులకు ఆయన కోడ్రిఫ్ సిరఫ్ను సూచించారు. దీంతో 11 మంది చిన్నారులు అస్వస్థతకు గురై మరణించారు.
ఈ నేపథ్యంలో కోల్డ్రిఫ్ సిరప్ అమ్మకాలను మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది. డాక్టర్‌పై కేసు నమోదుచేసిన పోలీసులు అదుపులోకి తీసుకుంది. ఆ సిరప్‌ను ఉత్పత్తి చేస్తున్న శ్రీసన్ ఫార్మాస్యూటికల్స్‌పై ప్రభుత్వం కేసు నమోదుచేసింది. ఈ కంపెనీ తమిళనాడులోని కాంచీపురంలో ఉన్నది. సిరప్‌లో నాన్-ఫార్మాకోపోయియా-గ్రేడ్ ప్రొపైలిన్ గ్లైకాల్‌ను ఉపయోగించారని దర్యాప్తులో తేలింది. ఈ డ్రగ్ కిడ్నీలకు హాని కలిగించే విషపూరిత పదార్థాలైన డైథిలిన్ గ్లైకాల్ (DEG), ఇథిలీన్ గ్లైకాల్‌తో కలుషితమైనట్లుగా అనుమానిస్తున్నారు. ఈ నివేదిక తర్వాత తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం వెంటనే రాష్ట్రవ్యాప్తంగా కోల్ట్రిఫ్ సిరప్ అమ్మకం, వాడకాన్ని నిషేధించింది. హోల్‌సేల్, రిటైల్ దుకాణాల్లో స్టాక్‌ను ఫ్రీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కంపెనీకి ఉత్పత్తిని నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. తయారీ లైసెన్స్‌ను రద్దుకు షోకాజ్ నోటీస్ పంపారు.