శస్త్రచికిత్సలు పేషెంట్ల జీవితాలను మార్చేస్తాయి. అవి టైం ప్రకారం జరగకపోతే ప్రాణాల మీదకు వస్తుంది. ఈ విషయం ఆ డాక్టర్‌కు స్పష్టంగా తెలుసు. అందుకే తను ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి కూర్చుంటే ఫలితం ఏదీ ఉండదని అర్థం చేసుకున్నాడు. వెంటనే కారు దిగి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి పరుగుతీశాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది.
ఇక్కడి మణిపాల్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ గోవింద్ నందకుమార్ ఎప్పట్లాగే ఆస్పత్రికి బయలుదేరారు. ఆయన ఉదయం 10 గంటలకు ఒక మహిళకు గాల్‌బ్లాడర్ శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. అయితే మార్గమధ్యంలో విపరీతంగా ట్రాఫిక్ ఉండటంతో ఆయన ముందుకు వెళ్లలేకపోయారు. దీంతో ఏం చేయాలో ఆయనకు తోచలేదు.
ఎంతకీ ట్రాఫిక్ తగ్గకపోవడంతో ఒక నిర్ణయానికి వచ్చేసి కారు దిగి, పరిగెత్తుకుంటూ ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడకు చేరుకున్న వెంటనే ఆపరేషన్‌కు రెడీ అయ్యి పేషెంట్ ప్రాణాలు కాపాడారు. శస్త్రచికిత్స సక్సెస్ కావడంతో సదరు మహిళను అనుకున్న సమయానికే డిశ్చార్జి చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
తన కోసం పేషెంట్ వెయిట్ చేస్తున్నాడన్న ఆలోచనతో ఇంకేం ఆలోచించకుండా ఆస్పత్రికి పరుగుతీశానని డాక్టర్ గోవింద్ నందకుమార్ చెప్తున్నారు. నిజంగా ఇలాంటి డాక్టర్ల వల్లే ఆ వృత్తిపై గౌరవం పెరుగుతోందని ఈ విషయం తెలిసిన కొందరు కామెంట్లు చేస్తున్నారు.