న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యంపై ( Delhi Air pollution ) సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. ఎన్నిసార్లు చెప్పినా కాలుష్యం కట్టడి దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని కేంద్రం, ఢిల్లీ, యూపీ ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యంపై సీజేఐ ఎన్వీ రమణ, డీవై చంద్రచూడ్, సూర్యకాంత్ నేతత్వంలోని ధర్మాసనం శుక్రవారం కూడా విచారణ జరిపింది. కాలుష్యం కట్టడికి ఏం చర్యలు తీసుకోబోతున్నారో 24 గంటల్లోగా చెప్పాలంటూ గురువారం సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. కేంద్రం ఇవాళ అఫిడవిట్ సమర్పించింది.
ఢిల్లీలో వాయు కాలుష్యం కట్టడికి ఐదుగురు సభ్యుల టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం తన అఫిడవిట్లో తెలిపింది. నిబంధనలను ఉల్లంఘించే వారిపై టాస్క్‌ఫోర్స్, ఫ్లైయింగ్ స్క్వాడ్ ఉక్కుపాదం మోపుతాయని పేర్కొన్నది. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్ చర్యలు తీసుకుంటుందని స్పష్టంచేసింది. ఈ సందర్భంగా యూపీ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ రంజిత్‌కుమార్ వాదనలు వినిపించారు. ఢిల్లీలో వాయు కాలుష్యానికి యూపీలోని పరిశ్రమలు కారణం కాదని, పాకిస్తాన్ వల్లే ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతున్నదని ఆయన వాదించారు.
యూపీలోని పరిశ్రమలు ఢిల్లీకి దిగువన ఉంటాయని, అలాంటప్పుడు పరిశ్రమల నుంచి వెలువడే పొగ ఎగువ భాగంలో ఉండే ఢిల్లీకి ఎలా వెళ్తుందని ప్రశ్నించారు. పాకిస్తాన్ నుంచే కాలుష్య కారకాలు వస్తున్నాయని, అందుకే ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతున్నదని వాదించారు. సుప్రీంకోర్టు ఆంక్షలతో యూపీలోని చెరుకు, పాల పరిశ్రమలపై తీవ్ర ప్రభావం పడుతుందని కోర్టుకు విన్నవించారు. ఆయన వ్యాఖ్యలపై సీజేఐ జస్టిస్ రమణ ఘాటుగానే స్పందించారు. ఇప్పుడేంటి.. పాకిస్తాన్లో పరిశ్రమలపై నిషేధం విధించాలా? అని ప్రశ్నించారు.