Supreme Court : దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు (Supreme Court) లో బుధవారం ఉదయం ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ సీనియర్ న్యాయవాది (Senior lawyer).. తన క్లయింట్ పిటిషన్‌పై అత్యవసరంగా ఇదేరోజు విచారణ చేపట్టాలని సీనియర్ న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాలున్న జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakanth) ను కోరారు. దాంతో ఆయన వెంటనే స్పందించారు. సదరు న్యాయవాదిని ఉద్దేశించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
న్యాయవ్యవస్థ భారీగా పనిభారాన్ని మోస్తోందని అన్నారు. తాము (న్యాయమూర్తులు) సరిపడా నిద్రకూడా పోవడం లేదు తెలుసా..? అని వ్యాఖ్యానించారు. ‘ఎవరినైనా ఉరితీస్తున్నారంటే తప్ప మరే పిటిషన్‌ను కూడా నేను అదేరోజు విచారణకు స్వీకరించను. న్యాయమూర్తులు అవస్థలు మీకు అర్థంకావు. మేం రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతున్నామో మీకు తెలుసా..?’ అని ప్రశ్నించారు.
తన క్లయింట్‌కు సంబంధించిన ఇంటిని ఇవాళ వేళం వేస్తున్నారని, అతడి పిటిషన్‌పై ఈరోజే అత్యవసరంగా విచారణ జరుపాలని ఓ సీనియర్ న్యాయవాది కోరడంతో జస్టిస్ సూర్యకాంత్‌పై వ్యాఖ్యలు చేశారు. ఎవరినైనా ఉరితీస్తున్నారంటే తప్ప మరే పిటిషన్‌ను కూడా తాను అదేరోజు విచారణకు స్వీకరించేది లేదని తేల్చిచెప్పారు. కాగా జస్టిస్ సూర్యకాంత్‌కు సీనియారిటీపరంగా సీజేఐ పదవికి దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు జనాల్లో ఆసక్తిరేపాయి.