Supreme Court | ప్రస్తుత మంత్రులు, ఎమ్మెల్యేలపై ఉన్న ఏ కేసునైనా దర్యాప్తు లేకుండా ఉపసంహరించుకోకూడదని సుప్రీంకోర్టు తమిళనాడూ ప్రభుత్వానికి సూచించింది. తమిళనాడులో ప్రస్తుత మంత్రులపై పెండింగ్లో ఉన్న కేసులను రాష్ట్రం వెలుపలకు బదిలీ చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విషయంలో అఫిడవిట్ దాఖలు చేయాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం స్టాలిన్ ప్రభుత్వానికి సూచించింది.
తమిళనాడులో సిట్టింగ్ మంత్రులపై పెండింగ్లో ఉన్న కేసులను రాష్ట్రం వెలుపలకు బదిలీ చేయాలని కోరుతూ చెన్నైకి చెందిన న్యాయవాది దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్ల వాదనల ప్రకారం.. కొంతమంది రాష్ట్ర మంత్రులు, రాజకీయ నాయకులపై ప్రాసిక్యూషన్కు ఇచ్చిన అనుమతిని రాజకీయల కారణంగా ఏజెన్సీలు ఉపసంహరించుకున్నాయని, ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీలు కూడా తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అమిత్ ఆనంద్ తివారీ కోర్టుకు హాజరయ్యారు.
పిటిషనర్ అనవసరంగా కోర్టును ఆశ్రయించారన్నారు. అయితే, రాష్ట్రం ప్రభుత్వం పిటిషనర్కాకుండా కోర్టును సంతృప్తి పరచడానికి అఫిడవిట్ దాఖలు చేస్తుందని ధర్మాసనం తెలిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది డీఎస్ నాయుడు హాజరయ్యారు. దర్యాప్తు పూర్తి కాకముందే ఆమోదం ఉపసంహరించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయన్నారు. అలాంటి కేసుల్లో న్యాయ పర్యవేక్షణ కోసం ఆయన డిమాండ్ చేశారు. పిటిషనర్ సమగ్రతపై ఆరోపణల నేపథ్యంలో జస్టిస్ భుయాన్ న్యాయవాది నాయుడుతో మాట్లాడుతూ ఈ వ్యాధి తమిళనాడుకే పరిమితం కాదని.. ఇది మొత్తం దేశమంతటా ఉందని అన్నారు. కేసు విచారణనను సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేశారు.