న్యూఢిల్లీ: దేశంలోని 11 రాష్ర్టాల్లో 111 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శుక్రవారం ఒక్కరోజే 24 కేసులు వెలుగులోకి వచ్చాయి. మొత్తం 19 జిల్లాలు కొవిడ్-19 రిస్క్ జోన్లో ఉన్నాయని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఐరోపా అంతటా చాలా వేగంగా ఒమిక్రాన్ విస్తరిస్తున్నదని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. నూతన సంవత్సర వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాలని, గుమికూడకుండా ఉండాలని ప్రజలను కోరింది. మాస్కు ధరించడం, భౌతిక దూరం వంటి కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. గత 20 రోజులుగా దేశంలో 10 వేల కన్నా తక్కువ కొవిడ్ కేసులు నమోదవుతున్నాయని, అయితే వేరే దేశాల్లో కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నది. బ్రిటన్లో నమోదవుతున్న ఒమిక్రాన్ కేసుల తీరును పరిశీలించగా, భారత్లో రోజుకు 14 లక్షల వరకు కేసులు వచ్చే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. తాజా లెక్కల ప్రకారం మహారాష్ట్రలో అత్యధికంగా 40 కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. ఢిల్లీలో 22, రాజస్థాన్లో 17, కర్ణాటకలో 8, తెలంగాణలో 8, గుజరాత్లో 5, కేరళలో 7, ఆంధ్రప్రదేశ్, ఛండీగఢ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్లు వివరించింది.