CM Vijay : తమిళనాడు ఎమ్మెల్యేలకు కార్లు ఇస్తామంటూ సీఎం విజయ్ ఇటీవల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ప్రతిపక్ష డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. తమిళనాడులోని 234 మంది ఎమ్మెల్యేలకు కార్లు, పెట్రోల్, డ్రైవర్ అలవెన్సుల కింద మరో రూ.75,000 ఇస్తామని సీంఎ విజయ్ గత బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు.
అవినీతికి ఆస్కారం లేకుండా, కార్లు లేని ఎమ్మెల్యేలకు ఉపయోగపడేలా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే, ఈ నిర్ణయంపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో అప్పుల్లో ఉందని చెబుతున్న ప్రభుత్వం ఇలా ఎమ్మెల్యేలకు కార్లు అందివ్వడం ఏంటని ఉదయనిధి స్టాలిన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తమ డీఎంకేకు చెందిన 59 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వం ఇచ్చే కార్లు తీసుకోబోరని ఆయన అన్నారు. తమ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉదయనిధి అసెంబ్లీ వేదికగా వెల్లడించారు.
అయితే, ఆర్థికంగా వెనుకబడి ఉన్న ఎమ్మెల్యేలకు మాత్రమే ఆ వాహనాల్ని అందజేయాలని సూచించారు. ఈ అంశాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని, నిజంగా అవసరమైన ఎమ్మెల్యేలకు మాత్రమే వాహనాలు ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా ప్రభుత్వం ఖర్చులు తగ్గించడానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వాహనాలు ఇచ్చే ముందు ఎమ్మెల్యేల ఎలక్షన్ అఫిడవిట్లు పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. వారి ఆర్థికి స్థితికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అప్పుల్లో ఉన్నందువల్ల ఉచిత పథకాలకు వ్యతిరేకం అని టీవీకే చెప్పిందని, అందువల్ల ప్రభుత్వానికి భారం తగ్గించేందుకు తమ ఎమ్మెల్యేలు కార్లు తీసుకోవడం లేదని డీఎంకే తేల్చిచెప్పింది.
అయితే, దీనిపై టీవీకే మంత్రి అధవ్ అర్జున స్పందించారు. తమ ప్రభుత్వంలోని కొందరు ఎమ్మెల్యేలు పేద కుటుంబాల నుంచి వచ్చారని, వాళ్లలో చాలా మందికి సొంత కార్లు లేవని, అందువల్ల వారికి కార్లు అందజేయాలన్న ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. సొంత కార్లు ఉన్న ఎమ్మెల్యేలకు ఈ నిర్ణయం వర్తించబోదని స్పష్టం చేశారు.