Prajapoll Survey : తమిళనాడు (Tamil Nadu) లో రేపు అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ప్రజాపోల్ (Prajapoll) సర్వే సంస్థ తన ప్రీ పోల్ సర్వే (Prepoll Survey) ఫలితాలను వెల్లడించింది. రాష్ట్రంలో అధికారి డీఎంకే (DMK) కే ప్రజలు మరోసారి పట్టంగట్టబోతున్నారని స్పష్టం చేసింది. మొత్తం 234 స్థానాల్లో డీఎంకే సొంతంగా 117 స్థానాలు గెలుచుకుంటుందని సర్వే సంస్థ తెలిపింది. డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయెన్స్ (SPA) మొత్తం 150 స్థానాలు గెలుచుకుని మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నది.
ఎస్పీఏ కూటమిలో అధికార డీఎంకేకు 117 స్థానాలు, కాంగ్రెస్ 16 స్థానాలు, డీఎండీకేకు 7 స్థానాలు, వీసీకేకు 4 స్థానాలు, సీపీఐకి మూడు స్థానాలు, సీపీఎంకు స్థానాలు, ఐయూఎంఎల్‌కు ఒక స్థానం దక్కే అవకాశం ఉందని ప్రజాపోల్ సర్వే వెల్లడించింది. ఇక ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి కేవలం 70 స్థానాలకే పరిమితం అవుతుందని తెలిపింది. అందులో ప్రధాన పార్టీ అన్నాడీఎంకేకు 53 స్థానాలు, బీజేపీకి 9 స్థానాలు, పీఎంకేకు 7 స్థానాలు, ఏఎంఎంకేకు ఒక స్థానం లభిస్తుందని సర్వే సంస్థ అంచనా వేసింది. ఇక నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 14 స్థానాలతో సరిపెట్టుకుంటుందని సర్వే సంస్థ పేర్కొన్నది.
తమిళనాడులో ఏ పార్టీకి వరుసగా రెండు పర్యాయాలు అధికారం కట్టబెట్టని చరిత్ర ఉండేది. కానీ 2016 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకేకు అప్పటి అధినేత్రి జయలలిత ఆ చరిత్రను తిరగరాశారు. 2011 ఎన్నికల్లో గెలిచి అప్పటికే ఒక టర్మ్ పూర్తిచేసుకున్న జయలలిత.. 2016లోనూ తన పార్టీని గెలిపించుకున్నారు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకే అనారోగ్యంతో ఆమె కన్నుమూశారు. అనంతరం ఎడప్పాడి పళని స్వామి ముఖ్యమంత్రి అన్నాడీఎంకే సర్కారు కొనసాగింది.
2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చింది. ఫస్ట్ టర్మ్‌ను పూర్తిచేసి ఇప్పుడు రెండోసారి గెలిచేందుకు పావులు కదుపుతున్నారు. ప్రజాపోల్ సంస్థ ప్రీ పోల్ సర్వే నివేదిక కూడా డీఎంకేదే మళ్లీ అధికారం అని స్పష్టం చేస్తుండటంతో.. జయలలిత మాదిరిగానే స్టాలిన్ కూడా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, గత ఏడాది బీహార్ ఎన్నికల్లో కూడా తమ సర్వే అంచనాలు నూటికి నూరుశాతం ఫలించాయని ప్రజాపోల్ సర్వే సంస్థ అధినేత, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ రామ్మోహన్ తెలిపారు.