చెన్నై: భాషా వివాదంలో జోక్యం చేసుకుంటూ జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తమిళనాడుపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపాయి. పవన్ వ్యాఖ్యలపై అధికార డీఎంకే తీవ్రంగా స్పందించింది. పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో పవన్ ప్రసంగిస్తూ తమిళనాడు రాజకీయ నాయకులు ఆత్మవంచనకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఆర్థిక ప్రయోజనాల కోసం తమిళ చిత్రాలు హిందీలోకి డబ్బింగ్ జరగడానికి అనుమతించే తమిళనాడు నాయకులు హిందీ భాషను మాత్రం వ్యతిరేకిస్తారని ఆయన అన్నారు. దేశ సమైక్యత కోసం తమిళంతో సహా బహుళ భాషలు దేశానికి అవసరమని పవన్ అన్నారు.
జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) అమలుపై తమిళనాడులో అధికార డీఎంకే, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం రాజుకున్న నేపథ్యంలో డీఎంకే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలపై డీఎంకే ఘాటుగా స్పందించింది. 1938 నుంచి హిందీని తమిళనాడు వ్యతిరేకిస్తోందని డీఎంకే నాయకుడు టీకేఎస్ ఇళంగోవన్ శనివారం వివరించారు. మొదటి నుంచీ తమిళనాడు ద్విభాషా విధానాన్నే పాటిస్తోందని ఆయన చెప్పారు. పాఠశాలల్లో తమిళం, ఇంగ్లిష్లో బోధనలు ఉంటాయని, ఇందుకు సంబంధించిన బిల్లు పవన్ కల్యాణ్ పుట్టక ముందే తమిళనాడులో ఆమోదం పొందిందని ఆయన వ్యాఖ్యానించారు.
ద్విభాషా సూత్రాన్ని పాటిస్తామని తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేసుకున్నామని ఆయన చెప్పారు. విద్యా రంగంలో సూచనల కారణంగా ద్విభాషా విధానాన్ని అమలుచేస్తున్నామే తప్ప సినిమా నటులు చెప్పారని కాదని ఆయన స్పష్టం చేశారు. 1968లో బిల్లు ఆమోదం పొందినపుడు పవన్ పుట్టి ఉండకపోవచ్చని డీఎంకే నేత వ్యాఖ్యానించారు. తమిళనాడు రాజకీయాల గురించి ఆయనకేం తెలుసన్నారు. పవన్ వ్యాఖ్యలపై మరో నటుడు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ మీ హిందీని మా మీద రుద్దవద్దని చెప్పారు. హిందీని వ్యతిరేకించడమంటే మరో భాషను ద్వేషించినట్టు కాదని తెలిపారు. మన మాతృభాషను, మన సాంస్కృతిక ఉనికిని గర్వంతో పరిరక్షించుకోవడమని చెప్పారు.